9 రోజుల విరామం తర్వాత భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం.. ఈ రోజు యూపీలోకి రాహుల్ ఎంట్రీ..

By Sumanth KanukulaFirst Published Jan 3, 2023, 12:24 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను మంగళవారం పునఃప్రారంభించారు. తొమ్మిది రోజుల విరామం తర్వాత ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ నుంచి రాహుల్ గాంధీ తన పాదయాత్రను ప్రారంభించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను మంగళవారం పునఃప్రారంభించారు. తొమ్మిది రోజుల విరామం తర్వాత ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ నుంచి రాహుల్ గాంధీ తన పాదయాత్రను ప్రారంభించారు. అంతకుముందు ఈరోజు ఉదయం రాహుల్ గాంధీ ఢిల్లీలోని యమునా బజార్ ప్రాంతంలోని హనుమాన్ మందిర్‌ను సందర్శించారు. అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం యాత్రను ప్రారంభించారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. 

ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజులపాటు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. జనవరి 6న రాహుల్ యాత్ర తిరిగి హర్యానాలోకి ప్రవేశిస్తుంది. ఆ  తర్వాత జనవరి 11న పంజాబ్‌లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ రాహుల్ యాత్ర జనవరి 20 వరకు సాగనుంది. అయితే ఈ మధ్యలో ఒకరోజు జనవరి 19న హిమాచల్ ప్రదేశ్‌లో రాహుల్ యాత్ర సాగనుంది. ఇక, జనవరి 20న రాహుల్ భారత్ జోడో యాత్ర జమ్మూ కశ్మీర్‌లోకి ప్రవేశించనుంది.

ఇక, సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర యాత్ర ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో సాగింది. జనవరి చివరి నాటికి రాహుల్ యాత్ర జమ్మూ కాశ్మీర్‌లో ముగియనుంది. రాహుల్ యాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక,  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలోని తొమ్మిది రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో దాదాపు 3,000 కిలోమీటర్ల మేర సాగింది. డిసెంబర్ 24న రాహుల్ పాదయాత్ర ఢిల్లీలోకి ప్రవేశించింది. అదే రోజు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన సమావేశం అనంతరం.. యాత్రకు తొమ్మిది రోజుల విరామం తీసుకున్నారు. 

click me!