
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. ఈ సారి ముచ్చింతల్‌లో ఇటీవలే ప్రారంభించిన సమతా విగ్రహాన్ని (Statue Of Equality) ఆధారంగా చేసుకుని విమర్శించారు. సమతా విగ్రహాన్ని చైనా తయారు చేసిందని ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తరుచూ ప్రవచించే న్యూ ఇండియా అంటే చైనా నిర్భర్ అని అర్థమా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నది. ప్రచారం చేసింది. మన ఆర్థిక వ్యవస్థను మనమే నిలబెట్టుకోవాలని, మన దేశ అవసరాలను మనమే తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఆత్మ నిర్భర్ నినాదం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ అవసరాలను భారతీయులే తీర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నది ఆ నినాదం ముఖ్య ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ చైనా నిర్భర్ (China nirbhar) అనే వ్యంగ్యాన్ని జోడించి కేంద్రంపై విమర్శలు చేశారు.
హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో (Muchintal) ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన రామానుజాచార్యుల ప్రతిమ(సమతా విగ్రహం)ను చైనా కంపెనీ నిర్మించినట్టు ఆ ప్రాజెక్టు వెబ్‌సైట్ తెలిపింది. 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని నిర్మించే రూ. 135 కోట్ల కాంట్రాక్టును చైనాకు చెందిన ఎరోసన్ కంపెనీ 2.15లో దక్కించుకున్నట్టు వివరించింది. కూర్చున్న పొజిషన్‌లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మెటాలిక్ స్టాచ్యూగా ఈ సమతా విగ్రహానికి రికార్డు ఉంది.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇవాళ హైదరాబాద్ కి రానున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామ నగరంలో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ పాల్గొంటారు. త్రిదండి చిన జీయర్ స్వామి ఆహ్వానం మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు వస్తున్నారు. మధ్యాహ్నం 3.30 కి ముచ్చింతల్ కు ఆయన రానున్నారు. రాత్రి 8 గంటల వరకు వివిధ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొంటారు. ప్రవచన మండపంలో జరిగే ధర్మాచార్య సభలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రసంగించనున్నారు. అలాగే.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఆర్ఎస్ఎస్ కి చెందిన భయ్యాజీ జోషీ లు కూడా శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను సందర్శించనున్నారు.
హైదరాబాద్ శివారు శంషాబాద్ కు సమీపంలో ఉన్న ముచ్చింతల్లో ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. శ్రీరామనగరం భక్తజనంతో నిండిపోయింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. 216 అడుగుల భగవద్రామానుజ చార్యుభల విగ్రహాన్నిసందర్శించుకుని తామని తాము మైమరిచిపోతున్నారు. ఈ మహా క్రతువులో 5 వేల మంది రుత్విజులు యాగశాలలో హోమాలను నిర్వహిస్తున్నారు. 114 యాగశాలల్లో 1035 హోమ గుండాల్లో పారాయణల మధ్య ఘనంగా హోమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 108 దివ్య దేశాల్లో ఆలయాల్లో ప్రాణప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే.