2019లోనే మత్స్య శాఖ.. అప్పుడు ఆయన లీవ్‌లో వున్నారు: రాహుల్‌పై అమిత్ షా సెటైర్లు

By Siva KodatiFirst Published Feb 28, 2021, 5:02 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. కేంద్రంలో మత్స్య శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి షా ఈ వ్యాఖ్యలు చేశారు

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. కేంద్రంలో మత్స్య శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి షా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం పాండిచ్చేరిలోని కరైకాల్‌లో జరిగిన ర్యాలీలో అమిత్ షా పాల్గొని, ప్రసంగించారు. ఆనవంశిక రాజకీయాల కారణంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కుప్పకూలిందని ఆయన ఆరోపించారు.  

2019లో మత్స్య, పశుసంవర్ధక శాఖను ఏర్పాటు చేసినప్పుడు రాహుల్ సెలవులో ఉన్నారంటూ అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత రెండేళ్లుగా మత్స్య శాఖ అనేది ఉందనే విషయం కూడా తెలియని నాయకుడిని ప్రజలు కోరుకుంటున్నారా అనేది తాను తెలుసుకోవాలని భావిస్తున్నట్లు అమిత్ షా చురకలు వేశారు. 

పాండిచ్చేరిలో ఇటీవల కుప్పకూలిన వి.నారాయణ స్వామి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు చేశారు. దిగజారుడు రాజకీయాల కారణంగానే కేంద్ర ప్రభుత్వ పథకాలను పుదుచ్చేరిలో ఆయన అమలు చేయలేదని అమిత్ షా ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడానికి బీజేపీనే కారణమని నారాయణ స్వామి తప్పుపడుతున్నారని మండిపడ్డారు. కానీ అనువంశ రాజకీయాల కారణంగా దేశంలో కాంగ్రెస్ కుప్పకూలిందని, ఆ కారణంగానే అనేక మంది నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్నారని అమిత్ షా గుర్తుచేశారు.

కాగా, సముద్ర రైతులైన జాలర్లకు ప్రత్యేకంగా ఓ శాఖ ఉండాలంటూ ఇటీవల కేరళ, పుదుచ్చేరిలో రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే ఆ శాఖ ఇప్పటికే ఉందంటూ కేంద్ర మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సహా పలువురు బీజేపీ నేతలు రాహుల్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

click me!