రోడ్డుపై ముందు వెళ్తున్న ట్రక్కును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు.
పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగ్రూర్‌లోని మెహ్లాన్ చౌక్ ప్రాంతంలో అర్దరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 ఏళ్ల చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. బాధితులు ప్రయాణిస్తున్న కారు.. ముందు వెళ్తున్న ట్రక్కును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నం చేసిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారని.. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
మృతులను నీరజ్ సింగ్లా (37), అతని 4 ఏళ్ల కుమారుడు, లలిత్ బన్సాల్ (45), దవేష్ జిందాల్ (33), దీపక్ జిందాల్ (30), విజయ్ కుమార్ (50)లుగా గుర్తించారు. వీరంతా సునమ్ ప్రాంతానికి చెందినవారు. బాధితులు మారుతీ 800 కారులో మలేర్‌కోట నుంచి సునమ్‌కు తిరిగి వస్తుండగా అర్దరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మెహ్లాన్ చౌక్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఓవర్ టేక్ చేసేందుకు యత్నించింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో ట్రక్కును ఢీకొట్టింది. ఇక, మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.