ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఈడీ, సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. ఈడీ తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శలు చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కు మూడు రోజుల క్రితం నోటీసులు పంపారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇవాళ విచారణకు హాజరు కాలేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి లేఖ రాశారు. ముందుగా నిర్ణయించి షెడ్యూల్ ప్రకారంగా తాను ఈ విచారణకు హాజరు కాలేనని అరవింద్ కేజ్రీవాల్ ఆ లేఖలో పేర్కొన్నారు. తనకు జారీ చేసిన నోటీసులు చట్టవిరుద్దమని ఈడీకి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్దమైందని కూడ పేర్కొన్నారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కు
సమన్లు పంపిన విషయం తెలిసిందే.ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేమితమైనవిగా అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. బీజేపీ కోరిక మేరకు ఈడీ తనకు నోటీసులు పంపిందని ఆయన ఆరోపించారు. తనకు పంపిన నోటీసును వెనక్కి తీసుకోవాలని కూడ అరవింద్ కేజ్రీవాల్ కోరారు.మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తో కలిసి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ రోడ్ షో లో పాల్గొనాల్సి ఉంది. ఈ కార్యక్రమం ఉన్నందున ఈడీ విచారణకు హాజరుకాలేనని కేజ్రీవాల్ ఆ లేఖలో పేర్కొన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ను ఈ కేసులో అరెస్ట్ చేయాలని కేంద్రం భావిస్తుందని ఆప్ ఆరోపిస్తుంది. ఇటీవలనే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనే అరవింద్ కేజ్రీవాల్ ను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈడీకి అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖపై బీజేపీ స్పందించింది. అవినీతిలో మునిగిపోయిన ఆప్ నేతలు దర్యాప్తు సంస్థలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2022 జూలై మాసంలో ఢిల్లీ లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ రద్దు చేసింది. కొన్ని సంస్థలు, వ్యక్తులకు ప్రయోజనం కలిగించేలా లిక్కర్ పాలసీని రూపొందించారని బీజేపీ అప్పట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణకు ఆదేశించారు.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ కు ఈడీ షాక్: నవంబర్ 2న విచారణకు రావాలని నోటీస్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో సీబీఐ అరెస్ట్ చేసింది. ఆప్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈ ఏడాది అక్టోబర్ మాసంలో అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ ను మనీలాండరింగ్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే.