ప్రధాని మోడీ పర్యటన రద్దుపై పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే..?

By Mahesh KFirst Published Jan 5, 2022, 6:13 PM IST
Highlights

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన అర్ధంతరంగా ముగిసింది. రైతు ఆందోళనకారులు రోడ్లను బ్లాక్ చేయడంతో భటిండా నుంచి ఫెరోజ్‌పుర్ వెళ్తుండగా ఓ ఫ్లై ఓవర్‌పై ప్రధాని మోడీ సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోవాల్సి వచ్చింది. అనంతరం, అక్కడి నుంచి తిరిగి భటిండా ఎయిర్‌పోర్టుకే వెనక్కి వెళ్లారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు మండిపడ్డారు. ప్రధానికి కల్పించాల్సిన భద్రతలో లోపాలు ఉన్నాయని ఆగ్రహించారు. ఈ వాదనలను పంజాబ్ ప్రభుత్వం తిప్పికొట్టింది.
 

చండీగడ్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) పంజాబ్(Punjab) పర్యటన అర్ధంతరంగా ముగిసింది. భటిండా ఎయిర్‌పోర్టు చేరుకున్న ప్రధాని మోడీ ఫెరోజ్‌పుర్ వెళ్లాల్సింది. ఫెరోజ్‌పుర్‌లోని హుస్సేనీవాలా గ్రామంలోని నేషనల్ మార్టిర్స్ మెమోరియల్ వెళ్లాలి. ఫెరోజ్‌పుర్‌లోని బీజేపీ నిర్వహిస్తున్న ర్యాలీ(BJP Rally)లోనూ మాట్లాడాలని షెడ్యూల్ ఉన్నది. కానీ, ప్రధాని మోడీ భటిండా ఎయిర్‌పోర్టు చేరిన తర్వాత అక్కడి నుంచి ఫెరోజ్‌పుర్‌కు హెలికాప్టర్ వెళ్లాలని ముందుగానే నిర్ణయించి ఉన్నది. కానీ, వాతావరణం సానుకూలంగా లేకపోవడంతో రహదారి గుండానే కార్ల కాన్వాయ్‌లో ఫెరోజ్‌పుర్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఫెరోజ్‌పుర్ వెళ్లక ముందే మధ్యలో రైతు ఆందోళనకారుల ప్రదర్శన కారణంగా ఓ ఫ్లై ఓవర్‌పై ప్రధాని కాన్వాయ్ సుమారు 15 నుంచి 20 నిమిషాలు నిలిచిపోయింది. ఈ అడ్డగింపుతో ప్రధాని మోడీ ఆ కార్యక్రమాలకు హాజరవ్వకుండా తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రధాన మంత్రికి పటిష్ట భద్రతా కల్పించకపోవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి అని, పంజాబ్ ప్రభుత్వం ప్రధానికి భద్రత కల్పించడంలో విఫలమైందని కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయితే, ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం వాదనలు భిన్నంగా ఉన్నాయి.

ర్యాలీకి మంది రాలేదనేనా?
పంజాబ్ సీఎం ఓ చానెల్‌తో మాట్లాడుతూ, ప్రధాని మోడీ భటిండా నుంచి ఫెరోజ్‌పుర్‌కు హెలికాప్టర్‌‌లో వెళ్లాల్సిందని, కానీ, వర్షం కారణంగా ఆయన ప్లాన్ మారిందని అన్నారు. హఠాత్తుగా ఆయన భటిండా నుంచి ఫెరోజ్‌పుర్‌కు కారు కాన్వాయ్‌లో బయల్దేరారని వివరించారు. దీనికి సంబంధించి తమకు ముందస్తు సమాచారం లేదని తెలిపారు. అన్ని దారుల్లోనూ రైతులు ధర్నాలు చేయకుండా కన్విన్స్ చేయడానికి తాను ఉదయం 3 గంటల వరకు పని చేశానని చెప్పారు. బుధవారం ఉదయానికల్లా అన్ని మార్గాలనూ ఓపెన్ చేయగలిగామని పేర్కొన్నారు. రోడ్డు మార్గంలో ప్రధాని ప్రయాణించే ప్లానే లేదని, ఒక వేళ ఉన్నా తమకు ముందస్తుగా ఆ వివరాలు తెలిపితే.. తగిన ఏర్పాట్లు చేసేవాళ్లమని తెలిపారు. రైతులు ఏడాది కాలంగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారని, వారిపై లాఠీ చార్జ్ చేసే ప్రసక్తే లేదని అన్నారు. ప్రధాని పర్యటనలో భద్రతా లోపం లేదని, ఆయనపై దాడి ప్రయత్నాలు అసలే లేవని పేర్కొన్నారు. ప్రధాని వెళ్తున్న దారిలో రైతులు ఓ చోట ఎడ్ల బండిని నిలిపారని, ఇది చాలా సహజమని, ఇది సెక్యూరిటీ బ్రీచ్ కాదని వివరించారు. అంతేకాదు, బీజేపీ తలపెట్టిన ర్యాలీలో 70 వేల మందికి ఏర్పాట్లు జరిగాయని, కానీ, అక్కడకు కేవలం 700 మంది మాత్రమే వచ్చారని తెలిపారు. ప్రధాని మోడీ మార్గం మధ్య నుంచే వెనుదిరిగి పోవడానికి ఇదీ ఓ కారణం అయి ఉండొచ్చని అన్నారు.

Also Read: పంజాబ్‌లో మోడీ పర్యటన రద్దు.. ప్రధాని రూట్ మ్యాప్ లీక్ వెనుక ఎవరు: స్మృతీ ఇరానీ ఆరోపణలు

పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధి కూడా ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా లోపం(Security Lapse) ఏర్పడిందనే ఆరోపణలు అర్థరహితమని పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ రాజ్ కుమార్ వివరించారు. ఆ ర్యాలీ కోసం బీజేపీ నేతలు పెద్ద మొత్తంలో జనాలను ఆకర్షించలేకపోయారని అన్నారు.

పంజాబ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. ప్రధానికి హాని చేయాలనే స్పష్టమైన ఉద్దేశం కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రధాని పర్యటన రూట్ మ్యాప్‌ను ఎవరు లీక్ చేశారని స్మృతీ ఇరానీ ప్రశ్నించారు. ప్రధానికి హాని చేయాలని చూసినవారికి శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాని రూట్ బయటకు ఎలా తెలిసిందో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని స్మృతి ఇరానీ కోరారు. నిరసనకారులు ప్రధాని కాన్వాయ్ దగ్గరకు ఎలా వెళ్లగలిగారని ఆమె ప్రశ్నించారు. ప్రధాని రూట్ మ్యాప్ సమాచారం సాధారణ ప్రజలకు తెలియదని స్మృతీ ఇరానీ అన్నారు. 

click me!