Punjab Election 2022: 94 ఏండ్ల‌ వయసులో ఎమ్మెల్యేగా ఎన్నిక‌ల బ‌రిలో.. ఎవరో తెలుసా?

Published : Jan 31, 2022, 02:58 PM IST
Punjab Election 2022: 94 ఏండ్ల‌ వయసులో ఎమ్మెల్యేగా ఎన్నిక‌ల బ‌రిలో.. ఎవరో తెలుసా?

సారాంశం

Punjab Election 2022: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్ అదురైన రికార్డు సృష్టించారు. మన దేశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అ‍త్యంత పెద్ద వయసు గల నాయకుడిగా ఆయన ఘ‌న‌త‌ సాధించారు . బాదల్‌  94 ఏళ్ల వయసులో  లంబి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేష‌న్ వేశారు. అంతకుముందు ఈ రికార్డు కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ పేరిట ఉండేది. 2016 ఎన్నికల్లో  92 ఏళ్ల వయసులో ఆయన పోటీ చేశారు.    

Punjab Election 2022: దేశంలో వ‌చ్చే నెల నుంచి జ‌రుగ‌నున్న‌ ఐదు  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పతాక స్థాయికి చేరుకోబోతున్నాయి. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జ‌రుగ‌నున్నాయి. ఈ మేరుకు  కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 10 నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభం కానున్నది. వ‌రుస‌గా  ఫిబ్రవరి 10,14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్ జ‌రుగ‌నున్న‌ది. అనంతం మార్చి 10న ఓట్ల లెక్కింపు జ‌రుగ‌నున్న‌ది.  

అయితే.. ఈ ఎన్నిక‌లు ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. దీనికి ప్ర‌ధానం కార‌ణం.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న అయిదింట్లో.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటమే. దీంతో ఈ ఎన్నిక‌ల‌కు అత్యంత‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్ర‌స్తుతం యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లల్లో బీజేపీ అధికారంలో ఉంది.  పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ ఎన్నిక‌ల్లో 
పంజాబ్‌‌ను ఎలాగైనా హస్తగతం చేసుకుని.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో తిరిగి అధికారం నిలబెట్టుకోవాల‌ని  బీజేపీ సర్వశక్తుల ప్ర‌య‌త్నిస్తోంది.  

ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు మ‌రో 20 రోజుల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉండ‌టంతో ప్ర‌చారం జోరందుకుంది. అధికార కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షలైన‌ ఆప్, శిరోమ‌ణి అకాలీద‌ళ్‌, బీజేపీ, బీఎస్పీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలు జోరుగా ప్ర‌చారాన్ని నిర్వహిస్తున్నాయి. అలాగే... జోరుగా ప్ర‌చారం చేయ‌డంతో పాటు నామినేష‌న్ల ప‌ర్వం కూడా అదే ఊపులో సాగుతోంది. 

ఈ ఎన్నిక‌ల్లో శిరోమ‌ణి అకాలీద‌ళ్ అధినేత సుఖ్‌బీర్‌సింగ్ బాద‌ల్ జలాలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేష‌న్ వేశారు. తాజాగా శిరోమణి అకాలీదళ్‌ కురువృద్ధుడు, సుఖ్‌బీర్‌సింగ్ తండ్రి, శిరోమ‌ణి అకాలీద‌ళ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్  లంబి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేష‌న్ వేశారు. త‌న అనుచ‌రుల‌తో రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యానికి వెళ్లి నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పించారు.

ఈ త‌రుణంలో ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.  మన దేశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అ‍త్యంత పెద్ద వయసు గల నాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు.  ప్రకాశ్‌ సింగ్‌ బాదల్ .. ఐదు పర్యాయాలు పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన బాదల్‌  94 ఏళ్ల వయసులో తాజాగా ఎన్నికల బరిలో నిలిచారు. అంతకుముందు ఈ రికార్డు కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ పేరిట ఉండేది. 2016 ఎన్నికల్లో  92 ఏళ్ల వయసులో ఆయన పోటీ చేశారు.  

75 ఏళ్ల రాజకీయ సుధీర్ఘ చరిత్ర కలిగిన ప్రకాశ్‌ సింగ్‌ బాదల్ .. 13 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.  1947లో బాదల్ గ్రామం నుంచి ఎన్నికైనప్పుడు ఆయన అతి పిన్న వయస్కుడైన సర్పంచ్. అంతేకాకుండా 1970లో అత్యంత పిన్న వయస్కుడైన సీఎం అయ్యారు. 2012లో అత్యంత వయోవృద్ధుడైన సీఎం అయ్యారు. 1970-71, 1977-80, 1997-2002, 2007-12, 2012-17 మధ్య కాలంలో 5 సార్లు  సీఎం గా పనిచేశారు. ఇలా ఐదు సార్లు సీఎంగా ప‌నిచేసిన ఘనత ఆయ‌న‌కే ద‌క్కింది. ఆయ‌న ఒక సారి పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.  

ఆయ‌న రాజకీయ జీవితంలో ఒక్క‌సారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. 1967లో గిద్దర్‌బాహాలో హర్‌చరణ్ సింగ్ బ్రార్ చేతిలో కేవలం 57 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తొలిసారి ఆయ‌న 1957లో కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ పొంది... మలౌట్ నియోజకవర్గం నుంచి గెలిపొందారు.  తర్వాత వరుసగా ఐదుసార్లు గిద్దర్‌బాహా నుంచి వ‌రుస విజ‌యాలను పొందారు.  అనంతరం లాంబి నియోజకవర్గం ఐదు సార్లు గెలుపొందారు. ప్ర‌స్తుత ఎన్నికల్లో కూడా ఆయ‌న ఇదే స్థానం నుంచిబరిలో దిగారు. 

 బాదల్ సేవాల‌కు గుర్తుగా  2015లో పద్మవిభూషణ్ పురస్కారం వ‌రించింది. కానీ..  మోడీ ప్ర‌బుత్వం తీసుక‌వ‌చ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020లో ఈ అవార్డును వెనక్కు ఇచ్చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి రైతుల మద్దతు తమకే ఉంటుందని అకాలీదళ్‌ భావిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

పాము కాటుతో మ‌ర‌ణించిన తండ్రి పేరుపై రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్‌.. అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్
MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్