
Tajinder Pal Singh Bagga: మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్ సింగ్ బగ్గాపై కేసు నమోదు చేశారు. మొహాలికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత సన్నీ అహ్లువాలియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు అయింది.
వివరాల్లోకెళ్తే.. 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్ పాల్ సింగ్ బగ్గాపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మత విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో తాజిందర్ పాల్ సింగ్ బగ్గాపై నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 1న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మార్చి 30న ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసం వెలుపల జరిగిన నిరసనలో భాగంగా.. కేజ్రీవాల్‌పై చేసిన తీవ్ర అనుచిత, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని బగ్గాపై ఆప్ మండిపడుతోంది.
తనను అరెస్టు చేసేందుకు పంజాబ్ పోలీసుల బృందం దేశ రాజధానిలోని తన ఇంటికి చేరుకుందని, అయితే తనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ గురించి తనకు తెలియదని బీజేపీ యువమోర్చా నాయకుడు శనివారం పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో నిర్వాసిత కాశ్మీరీ పండిట్ల దుస్థితిని కేజ్రీవాల్ ఎగతాళి చేశారని బగ్గా ఆరోపించారు, ఢిల్లీ సీఎం వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మొహాలిలోని పంజాబ్ స్టేట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మిస్టర్ బగ్గా పై ఎఫ్‌ఐఆర్ ఏప్రిల్ 1న నమోదైంది. ఈ క్రమంలో బగ్గాపై 153-A , 505, 506 (నేరసంబంధమైన) సహా సంబంధిత IPC సెక్షన్‌ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు..