ఛండీగడ్ యూనివర్సిటీ వీడియో లీక్ కేసులో జవాను అరెస్టు.. ‘బ్లాక్ మెయిల్’ ఆరోపణలు

By Mahesh KFirst Published Sep 24, 2022, 8:08 PM IST
Highlights

ఛండీగడ్ యూనివర్సిటీ వీడియో లీక్ కేసులో ఓ సోల్జర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీడియోలు లీక్ చేసిన యువతిని బ్లాక్ మెయిల్ చేసినట్టు ఫోరెన్సిక్, డిజిటల్ ఎవిడెన్స్‌లు ఉన్నాయని పోలీసులు వివరించారు.

న్యూఢిల్లీ: ఛండీగడ్ యూనివర్సిటీ హాస్టల్‌లో యువతుల బాత్ రూమ్ వీడియోలను ఓ యువతి లీక్ చేసిన కేసులో తాజాగా మరో అరెస్టు జరిగింది. పంజాబ్ పోలీసులు అరుణాచల్ ప్రదేశ్ నుంచి శనివారం ఆర్మీ జవానును అరెస్టు చేశారు. వీడియోలు లీక్ చేసిన యువతిని బ్లాక్ మెయిల్ చేశారనే ఆరోపణల కింద ఈ జవానును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇది ఈ కేసులో నాలుగో అరెస్టు. తొలుత వీడియోలు లీక్ చేసిన యువతి, ఆ తర్వాత ఆమె స్వస్థలానికి చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఛండీగడ్ యూనివర్సిటీ హాస్టల్‌లో యువతులు బాత్ రూమ్‌లలో స్నానం చేస్తుండగా అదే హాస్టల్‌లో ఉంటున్న మరో యువతి రహస్యంగా వీడియోలు తీసిందనే ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆమెకు తెలిసిన ఓ యువకుడికి పంపినట్టుగా కథనాలు వచ్చాయి. ఈ వీడియోలు వాట్సాప్‌లలో చక్కర్లు కొట్టాయి. ఈ విషయం తెలియగానే యూనివర్సిటీ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు.

పంజాబ్ పోలీసులు ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం సంజీవ్ సింగ్ అనే సోల్జర్‌ను అరెస్టు చేసినట్టు వివరించారు. లీక్డ్ వీడియో కేసులో అరెస్టు చేసిన ముగ్గురు నుంచి స్వాధీనం చేసుకున్న డివైజ్‌ల నుంచి డిజిటల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాతే ఈ సోల్జర్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, అసోంల పోలీసుల సహకారంతో మొహలీ పోలీసుల బృందం సేలా పాస్ దగ్గర ఆ సోల్జర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

స్థానిక కోర్టు నుంచి పోలీసులు రెండు రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌ను తీసుకున్నారు. ఆ సోల్జర్‌ను మొహలీలోని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని వివరించారు.
 

click me!