
చండీగడ్: పంజాబ్‌లో ఇద్దరు మాజీ మంత్రులపై అవినీతి కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో ఇద్దరు మంత్రుల అవినీతి బాగోతాన్ని తాను బయట పెడతానని మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించిన తర్వాతి రోజే కీలక పరిణామాలు జరిగాయి. విజిలెన్స్ బ్యూరో ఇద్దరు మాజీ మంత్రులు సాదు సింగ్ ధరమసోత్, సంగత్ సింగ్ గిల్జియాన్‌లపై మంగళవారం ఉదయం అవినీతి కేసు నమోదైంది.
ఈ కేసు నమోదైన రోజే అవినీతి కేసులో అరెస్టు అయిన అటవీ శాఖ అధికారి, కాంట్రాక్టర్‌ల స్టేట్‌మెంట్ల ఆధారంగా మాజీ మంత్రి సాదు సింగ్ ధరమసోత్, ఆయన ఇద్దరు పర్సనల్ అసిస్టెంట్లను పోలీసులు అరెస్టు చేసినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
పోలీసు వర్గాల ప్రకారం, రాష్ట్రంలో 25 వేల చెట్లను అక్రమంగా కూల్చివేయడంలో మాజీ అటవీ శాఖ మంత్రి సాదు సింగ్ ధరమసోత్ ప్రమేయం ఉన్నట్టు తెలిసింది. ఒక్క చెట్టును కొట్టేయడానికి అనుమతించడానికి రూ. 500 చొప్పున మంత్రి తీసుకున్నట్టు సమాచారం. దళితుల స్కాలర్షిప్‌ల స్కామ్‌లోనూ ఈ మంత్రి నిందితుడిగా ఉన్నట్టు తెలిసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పుకునే వరకు ఈయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ తర్వాత చరణ్ జిత్ సింగ్ చన్నీ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అటవీ శాఖ మంత్రిగా సంగత్ సింగ్ గిల్జియన్ బాధ్యతలు తీసుకున్నారు. సుమారు నాలుగు నెలల తన అటవీశాఖ మంత్రి పదవీ కాలంలో ఆయన రూ. 6.4 కోట్ల రూపాయలను అక్రమంగా కూడబెట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈయన చెట్లను రక్షించడానికి ఏర్పాటు చేసే ట్రీ గార్డుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ట్రీ గార్డు కొనుగోలులో రూ. 800 తన ఖాతాలో అక్రమంగా వేసుకున్నట్టు దర్యాప్తులో అధికారులు అనుమానిస్తున్నారు. ఆయన హయాంలో 80 వేల ట్రీ గార్డులను కొనుగోలు చేశారు.