
న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయంగా విమర్శలు తెచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ ఆమెపై యాక్షన్ తీసుకున్నా.. వివరణ ఇచ్చినా.. విమర్శలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే టీవీ డిబేట్లకు సంబంధించి బీజేపీ కొత్తగా కొన్ని రూల్స్ తెచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. టీవీ డిబేట్లలో పాల్గొనే పార్టీ ప్రతినిధుల ఎంపిక, వారికి కొన్ని ప్రత్యేక నిబంధనలు రూపొందించినట్టు వివరించాయి.
టీవీ డిబేట్లలో కేవలం అనుమతించిన ప్రతినిధులు మాత్రమే పాల్గొనాలని రూల్ తెచ్చినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. వారికి ఆ పనిని మీడియా సెల్ అప్పజెబుతుందని వివరించాయి. ఆ టీవీ డిబేట్లలో పార్టీ ప్రతినిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మతాన్ని, మతాన్ని వెల్లడించే గుర్తులు, మతానికి సంబంధించి ఫిగర్స్‌నూ విమర్శించరాదని స్పష్టం చేసినట్టు పేర్కొన్నాయి.
చర్చ వేడి వాడిగా జరుగుతున్నప్పుడు కూడా పార్టీ ప్రతినిధులు హద్దులు మీరవద్దని పార్టీ ఆదేశించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. డిబేట్లలో పార్టీ ప్రతినిధులు తమ భాష పట్ల జాగ్రత్త పాటించాలని తెలిపినట్టు పేర్కొన్నాయి. చర్చలో పడి ఆవేశానికి లోను కావొద్దని, ఆందోళనకు దిగొద్దని సూచించినట్టు వివరించాయి. ఎవరు రెచ్చగొట్టినా.. వారి ట్రాప్‌లో పడొద్దని, పార్టీ భావజాలాన్ని, ఆదర్శాలను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించరాదని పార్టీ ప్రతినిధులకు తెలిపినట్టు పేర్కొన్నాయి.
అంతేకాదు, టీవీలో చర్చించే టాపిక్ గురించి పార్టీ ప్రతినిధులు ముందస్తుగా తెలుసుకోవాలని, దానిపై చర్చకు సిద్ధం అయి టీవీ డిబేట్‌లో పాల్గొనాలని ఆదేశించినట్టు వివరించాయి. ప్రతినిధులు, ప్యానెలిస్టులు అజెండాకే కట్టుబడి ఉండాలని చెప్పినట్టు తెలిపాయి. అంతేకాదు, ప్రభుత్వం చేపడుతున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై టీవీ డిబేట్‌లలో ప్రతినిధులు తమ వాణి వినిపించాలని కోరినట్టు వివరించాయి.