బీజేపీలోకి కెప్టెన్ అమరీందర్ సింగ్! కమలంలో పీఎల్‌కే విలీనం

By Mahesh KFirst Published Sep 19, 2022, 4:02 PM IST
Highlights

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ రోజు బీజేపీలో చేరబోతున్నారు. ఆయన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను కూడా బీజేపీలో విలీనం చేయబోతున్నారు. ఈ రోజు ఉదయం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. కెప్టెన్ అమరీందర్ సింగ్‌తోపాటు ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బీజేపీలో చేరబోతున్నారు.

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ ఈ రోజు బీజేపీలో చేరబోతున్నారు. ఆయన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బీజేపీలో విలీనం చేయబోతున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి కాంగ్రెస్ ఆకస్మికంగా ఆయనను తొలగించింది. ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి వైదొలిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలిశారు. అప్పుడే ఆయన బీజేపీలో చేరుతారనే అంచనాలు వచ్చాయి. కానీ, వాటికి భిన్నంగా ఆయన సొంతంగా పార్టీ స్థాపించారు.

ఆ పార్టీ మీదనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో దిగాయి. కానీ కెప్టెన్ అమరీందర్ సింగ్ స్వయంగా  సొంత నియోజకవర్గం పాటియాలా నుంచి పరాజయం పాలయ్యారు. ఆయనతోపాటు ఇతరులు ఆయన పార్టీ మీద పోటిచేసిన వారూ ఓడిపోయారు.

తాజాగా, ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు స్పష్టం అవుతున్నది. ఈ రోజు ఉదయం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఈ రోజే ఆయన బీజేపీలోకి చేరబోతున్నట్టు తెలిసింది. ఆయన స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని కూడా అందులో విలీనం చేయబోతున్నట్టు సమాచారం అందింది. ఆయనతోపాటు ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు, మరో మాజీ ఎంపీ కూడా బీజేపీలో చేరబోతున్నారు.

కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇటీవలే లండన్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ ఆయన స్పైనల్ సర్జరీ చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను గత వారం కలిశారు.

సెప్టెంబర్ 12వ తేదీ ఆయన అమిత్ షాతో సమావేశం అయ్యాక మీడియాతో మాట్లాడుతూ భేటీ ఫలప్రదంగా సాగిందని అన్నారు. జాతీయ భద్రత, నార్కో టెర్రరిజం పెరుగుదల వంటి అంశాలు, పంజాబ్‌లో భావి ప్రణాళికలపై సంగ్రహంగా చర్చించినట్టు వివరించారు.

click me!