
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను (Punjab Assembly Election) కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. గురు రవిదాస్ జయంతి (Guru Ravidas Jayanti) వేడుకల నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌తో పాటు, పలు రాజకీయ పార్టీల నుంచి ఎన్నికలు వాయిదా వేయాలని వచ్చిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేసింది. షెడ్యూల్ ప్రకారం పోలింగ్ ఫిబ్రవరి 14న జరగాల్సిన ఉండగా.. దానిని ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. అనేక రాజకీయ పార్టీలు, పంజాబ్ ప్రభుత్వం, ఇతర సంస్థలు ఎన్నికలను వాయిదా వేయాలని కోరినట్లు Election Commission ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఇక, కౌంటింగ్ మాత్రం ముందుగా నిర్ణయించినట్టుగానే మార్చి 10వ తేదీన జరగనుంది.
‘... ఉత్సవాల రోజుకు ఒక వారం ముందు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వారణాసికి వెళ్లడం ప్రారంభిస్తారని.. ఫిబ్రవరి 14ను పోలింగ్ రోజును ఉంచడం వల్ల పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు వేయకుండా ఉండవచ్చని వారు మా దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాతినిధ్యాల నుంచి వెలువడిన కొత్త వాస్తవాలు, రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నుండి వచ్చిన ఇన్‌పుట్‌లు, గత ప్రాధాన్యత, ఈ విషయంలో అన్ని వాస్తవాలు, పరిస్థితులను పరిగణలోకి తీసుకన్న తర్వాత ఎన్నికలు రీ షెడ్యూల్ చేయాలని కమిషన్ నిర్ణయించింది’ అని ఈసీ పేర్కొంది.
కేంద్ర ఎన్నికల సంఘం తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి వేడుకలు జరగనున్నాయి. యూపీలోని వారాణాసిలో జరిగే ఈ ఉత్సవాలకు పంజాబ్ నుంచి ప్రజలు తరలివెళ్తారు. వారం రోజుల ముందు నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్తారు.
ఈ క్రమంలోనే ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వారణాసిలో జరిగే గురు రవిదాస్ జయంతి వేడుకలకు వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలని దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరానని సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు. పంజాబ్ లో దళిత వర్గానికి చెందినవారు దాదాపు 32శాతంగా ఉన్నారని వారి మనోభావాలను గుర్తించాల్సిన అవసరం ఉందని లేఖలో ప్రస్తావించారు. గురు రవిదాస్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పంజాబ్ నుంచి 20లక్షల మంది బెనారస్ వెళ్లే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ఈ క్రమంలో ప్రకటించిన షెడ్యూల్ ను మార్చాలని ఈసీని కోరారు.
ఇతర ప్రధాన పార్టీలు బీజేపీ, ఆప్, శిరోమణి అకాలీదళ్.. కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సమావేశమైన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకన్నారు.