
Punjab CM Bhagwant Mann: జలంధర్ జిల్లాలో వరద ప్రభావిత గ్రామాలను సందర్శించిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. ఆయన ప్రయాణిస్తున్న పడవ ఓవర్లోడ్ తో ప్రమాదానికి గురైంది. అయితే బోటు తిరిగి సమతుల్యత సాధించడంతో పెను ప్రమాదం తప్పింది. వరద ప్రభావిత గిదర్పిండి గ్రామాన్ని పరిశీలించేందుకు మన్ పర్యటించారు. బోటులో ఉన్నవారు దానిని విజయవంతంగా స్థిరీకరించి, అది మునిగిపోకుండా నిరోధించారు. ఆ సమయంలో పడవలో ఉన్న వారిలో భగవంత్ మాన్ కూడా ఉన్నారు.
అంతకు ముందు, భగవంత్ మాన్ ఫిరోజ్‌పూర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, అక్కడ బాధితులతో సంభాషించిన విషయాన్ని ట్వీట్ లో ప్రస్తావించారు. వరదల సమయంలో జరిగిన నష్టానికి ప్రభుత్వం పూర్తి పరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు, ఇళ్లు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఫిరోజ్‌పూర్‌లోని నిహాలా లావెరా వరద ప్రభావిత ప్రాంతాలను సర్వే చేశామని మన్ ట్విటర్ లో పేర్కొన్నారు. "ప్రజల బాధలు విని... వరదలు వృద్ధులను, పౌరులందరినీ ప్రభావితం చేశాయి... ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని... పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రజలకు సలహాలు ఇస్తాను. మీ సహకారంతో తగిన ఏర్పాట్లు చేస్తాం... అప్పటి వరకు ఒకరికొకరు అన్ని విధాలుగా అండగా ఉంటామని" తెలిపారు.
కాగా, ఈ వారం ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలతో పంజాబ్ తీవ్రంగా ప్రభావితమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మన్ నిహాలా లావేరా గ్రామాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. జలంధర్ జిల్లా మందల చన్నాలోని ధూస్సీ కరకట్టలో పగుళ్లను మరమ్మతు చేసే ప్రయత్నాలను ఆయన పరిశీలించారు. వరద పరిస్థితికి భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వమే కారణమని పంజాబ్ బీజేపీ శాఖ చీఫ్ సునీల్ జాఖర్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలు బాధితులకు తక్షణ సాయం అందించడం కంటే ఫొటో అవకాశాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్రస్థాయి పరిశీలన కోసం వేచి చూడకుండా నష్టపోయిన వారికి వెంటనే మధ్యంతర ఉపశమనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాఖర్ కోరారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పంజాబ్ మంత్రులు, ఆప్ నేతలు పర్యటించడాన్ని ప్రస్తావిస్తూ,'ఈ రోజు ప్రజలకు తక్షణ ఉపశమనం అవసరం, ఫోటో విన్యాసాలు కాదు' అని బీజేపీ నేత అన్నారు. జూలై 4న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా, ఆ తర్వాత జూలై 6న ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినా వరదల ఏర్పాట్లను ఎందుకు సమీక్షించలేదని జాఖర్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.