Amritpal Singh: నెల కిందే అమృత్‌పాల్‌ను అరెస్టు చేసేవాళ్లం.. కానీ..: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Apr 24, 2023, 12:28 AM IST
Highlights

అమృత్‌పాల్ సింగ్ అరెస్టు గురించి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమృత్‌పాల్ సింగ్‌ను మార్చి 18వ తేదీనే అరెస్టు చేసేవాళ్లమని, కానీ, రక్తాపాతాన్ని నివారించడానికి అప్పుడు చేయలేదని వివరించారు. ఇప్పుడు ఒక్క బుల్లెట్ కాల్చకుండానే అమృత్‌పాల్‌ను అరెస్టు చేశామని తెలిపారు.
 

న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్‌ను పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నెలకుపైగా ఆయన పరారీలోనే ఉన్నాడు. మార్చి 18వ తేదీన సీరియస్‌గా ఆయనను అరెస్టు చేయడానికి పంజాబ్ పోలీసులు ఆపరేషన్ మొదలుపెట్టారు. కానీ, నెలైనా అమృత్‌పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేయలేకపోయారనే చర్చ జరిగింది. ఈ తరుణంలోనే పోలీసులు ఆదివారం ఆయనను అరెస్టు చేశారు. ఈ పరిణామంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.

అమృత్‌పాల్ సింగ్‌ను తాము మార్చి 18వ తేదీనే అరెస్టు చేసేవాళ్లమని, కానీ, రక్తాపాతం జరగరాదనే ఉద్దేశంతోనే అప్పుడు అదుపులోకి తీసుకోలేదని అన్నారు. ఇప్పుడు ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండానే అమృత్‌పాల్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్.. పంజాబ్‌లో శాంతి, స్నేహపూర్వక వాతావరణం, సోదరాభావాన్ని డిస్టబ్ చేయడానికి జరిగిన ఒక కుట్ర  అని ఆరోపించారు. అయితే, ఈ కుట్రను తమ ప్రభుత్వం చాకచక్యంగా అరికట్టగలిగిందని, కీలకమైన వ్యక్తులను అరెస్టులు చేసి కుట్రను నిలువరించగలిగామని వివరించారు. తాము అమాయకులపై యాక్షన్ తీసుకోలేదని స్పష్టం చేశారు.

Also Read: అమృత్‌పాల్ సింగ్‌ను డిబ్రూగఢ్ జైలుకు తరలించిన పోలీసులు.. భద్రత కట్టుదిట్టం

అమృత్‌పాల్ సింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతున్నదని సీఎం భగవంత్ సింగ్ మాన్ వివరించారు. దేశానికి, రాష్ట్రానికి వ్యతిరేక శక్తుల చేతిలో ఆయన కీలుబొమ్మ అని ఆరోపించారు. అమృత్‌పాల్ సింగ్ అరెస్టు ఆలస్యం కావడంతో పంజాబ్ ప్రభుత్వం, పోలీసులపైనా అవాంఛనీయ చర్చ జరిగింది.

click me!