
IAF, Navy ready to bring back Indian nationals: సూడాన్ సంక్షోభం మరింతగా ముదురుతోంది. ఈ క్రమంలోనే అక్కడ చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ఐఏఎఫ్ విమానాలు, నౌకాదళానికి చెందిన పలు నౌకలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. భారత వైమానిక దళానికి చెందిన రెండు సీ-130జే విమానాలు ప్రస్తుతం జెడ్డాలో సిద్ధంగా ఉన్నాయనీ, హింసాత్మక సూడాన్ నుండి పౌరులను తరలించడానికి ఐఎన్ఎస్ సుమేధ సూడాన్ పోర్ట్ చేరుకుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆదివారం తెలిపింది.
వివరాల్లోకెళ్తే.. హింసాత్మక సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు సీ-130 విమానాలు, నౌకాదళ నౌక ఐఎన్ ఎస్ సుమేధ సిద్ధంగా ఉన్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆదివారం తెలిపింది. సంక్లిష్టమైన అక్కడి భద్రతా పరిస్థితిని భారతదేశం నిశితంగా పర్యవేక్షిస్తోందని, భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడానికి వివిధ భాగస్వాములతో సన్నిహితంగా సమన్వయం చేస్తోందని మంత్రిత్వ శాఖ తన తాజా ప్రకటనలో తెలిపింది.
"మా సన్నాహాల్లో భాగంగా, వేగంగా ముందుకు సాగడానికి భారత ప్రభుత్వం అనేక మార్గాలను అనుసరిస్తోంది. భారత వైమానిక దళానికి చెందిన రెండు సీ-130జే విమానాలు జెడ్డాలో సిద్ధంగా ఉన్నాయి. ఐఎన్ఎస్ సుమేధ పోర్ట్ సూడాన్ కు చేరుకుంది' అని ఎంఈఏ తెలిపింది. సుడాన్ అధికారులతో పాటు, విదేశాంగ మంత్రిత్వ శాఖ, సూడాన్ లోని భారత రాయబార కార్యాలయం కూడా ఐక్యరాజ్యసమితి, సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్, అమెరికా తదితర దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది" అని పేర్కొంది.
సూడాన్ లో సైన్యం, పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్ ) దేశవ్యాప్తంగా ప్రాణాంతకమైన అధికార పోరు సాగిస్తున్నాయి. నియంత ఒమర్ అల్-బషీర్ పతనమైన నాలుగు సంవత్సరాల తరువాత, అలాగే, సైనిక తిరుగుబాటు చోటుచేసుకున్న రెండు సంవత్సరాల తరువాత కొత్త పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ మద్దతు ఉన్న ప్రణాళికపై అసమ్మతి కారణంగా హింస చెలరేగింది. ఈ పరివర్తనను అడ్డుకుంటున్నారని ఇరు పక్షాలు పరస్పరం ఆరోపిస్తున్నాయి.
కాగా, అధికారిక లెక్కల ప్రకారం సూడాన్ లో భారతీయుల సంఖ్య 4,000గా ఉంది. ఆకస్మిక ప్రణాళికలు అమలులో ఉన్నాయని, అయితే క్షేత్రస్థాయిలో ఏ కదలిక అయినా భద్రతా పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని ఎంఈఏ తెలిపింది. ప్రస్తుతం సుడాన్ గగనతలాన్ని అన్ని విదేశీ విమానాలకు మూసివేశారు. ఓవర్ ల్యాండ్ కదలికలకు ప్రమాదాలు, లాజిస్టిక్ సవాళ్లు కూడా ఉన్నాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
సుడాన్ లో చిక్కుకుపోయిన భారతీయులతో తమ రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, సురక్షిత కదలికల సాధ్యాసాధ్యాలు, అనవసర ప్రమాదాన్ని నివారించాల్సిన ఆవశ్యకతపై వారికి సలహాలు ఇస్తోందని తెలిపారు. భద్రతా పరిస్థితులు సురక్షితంగా ప్రయాణించడానికి అనుమతించినప్పుడు ఖార్టూమ్ నగరం నుండి నిష్క్రమించడం సహా సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని సమన్వయం చేస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది.