
చండీగడ్: పంజాబ్ సీఎం భగవంత్ మన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఆయన యాంటీ కరప్షన్ కోసం హెల్ప్‌లైన్ నెంబర్ ప్రకటించారు. అది తన పర్సనల్ నెంబర్ అని వెల్లడించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా వేస్ట్ చేయబోనని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన పర్సనల్ నెంబర్‌నే యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నెంబర్‌గా ప్రకటించారు. షహీద్ భగత్ సింగ్ జయంతి నాడు అండే మార్చి 23వ తేదీన ఈ నెంబర్‌ను లాంచ్ చేయనున్నట్టు పంజాబ్ సీఎం వెల్లడించారు.
‘యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నెంబర్ నా పర్సనల్ నెంబరే ఉంటుంది. ఏ అధికారి అయినా లంచం అడిగితే.. అందుకు సంబంధించిన ఆడియో, వీడియోలు తన నెంబర్‌కు పంపండి’ అని మాన్ తెలిపారు. తన నెంబర్‌ను యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నెంబర్‌గా ప్రకటించి ఎవరినీ బెదిరించడం లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 99 శాతం మంది నిజాయితీపరులేనని వివరించారు. కాగా, కేవలం ఒక్క శాతం మంది అవినీతి పరులే మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఆ అవినీతి వ్యవస్థను కేవలం ఆప్ మాత్రమే క్లీన్ చేయగలదని తెలిపారు.
తన నెంబర్ కేవలం ప్రజలకు మాత్రమే కేటాయిస్తున్నానని, అవినీతి అధికారుల భాగోతాలను తన నెంబర్‌కు పంపాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వివరించారు. రోజువారీ పనుల్లో అవినీతికి పాల్పడే, ఇతర తప్పుడు పద్ధతులను అవలంభించే ఉద్యోగుల వీడియోలు, ఆడియోలు తీసి తనకు పంపించాలని సూచించారు.
పంజాబ్‌లో అవినీతి నిర్మూలన ఆప్ ప్రకటించిన హామీల్లో ప్రముఖమైంది. ఫిబ్రవరి 5న ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో ఈ హామీ ఇచ్చారు. పంజాబ్‌లో ఆప్ అధికారాన్ని ఏర్పాటు చేస్తే అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు. పంజాబ్ సీఎం మాన్ ఈ రోజు పోలీసులు, ప్రభుత్వ అధికారులతో తొలిసారి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అవినీతి రహిత ప్రభుత్వం కొనసాగాలని నొక్కి పలికారు.
తమ ప్రభుత్వంలో అవినీతి అధికారులకు చోటు లేదని సీఎం మాన్ అన్నారు. తన దృష్టికి అలాంటి ఫిర్యాదులు వస్తే.. వారిపై ఎట్టిపరిస్థితుల్లో జాలి చూపే అవకాశం లేదని వివరించారు. ఇదే సమయంలో ఆయన తొలిసారిగా పౌరులు, పోలీసు అధికారులకు రివార్డులు ప్రకటించారు. క్షేత్రస్తాయిలో ప్రజా జీవితాల్లో మెరుగు చేయడానికి దోహదపడి, న్యాయం దిశగా అడుగులు వేసే వారికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులు ఇస్తామని వివరించారు.
పంజాబ్ రాష్ట్ర 17వ సీఎంగా భగవంత్ మాన్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్ ఈ ప్రమాణస్వీకార వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో కొత్త సీఎంకు పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. భగవంత్ మాన్ పంజాబ్ ను అభివృద్ధి చేస్తాడని ఆకాంక్షించారు.
‘‘ఎవరూ ఊహించని వ్యక్తి సంతోషకరమైన వ్యక్తి భగవంత్ మాన్. పంజాబ్‌లో కొత్త మాఫియా వ్యతిరేక శకాన్ని అంచనాల పర్వంతో ఆవిష్కరిస్తాడు. ఆయన ఆ సందర్భానికి తగినట్లుగా ఎదుగుతాడని, ప్రజల అనుకూల విధానాలతో పంజాబ్‌ను ఎల్లప్పుడూ ఉత్తమమైన పునరుజ్జీవన పథంలోకి తీసుకువస్తాడని ఆశిస్తున్నాను ’’ అంటూ నవజ్యోత్ సింగ్ సిద్దూ ట్వీట్ చేశారు.