
చండీగడ్: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 424 మంది వీఐపీలకు తక్షణమే సెక్యూరిటీ కవర్‌ను రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. వీరందరికీ సెక్యూరిటీగా ఉన్న రక్షణ సిబ్బంది వెంటనే జలందర్ కంటోన్మెంట్‌లో ప్రత్యేక డీజీపీకి రిపోర్ట్ చేయాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ పోలీసు అధికారులు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నేతలు సహా పలువురు సెక్యూరిటీ కవర్ ఈ ఆదేశాలతో రద్దు అయ్యాయి. మొత్తం నాలుగు దఫాలుగా సెక్యూరిటీ రద్దు నిర్ణయాన్ని పంజాబ్ ప్రభుత్వం అమలు చేసింది.
ఈ నెల తొలినాళ్లలో భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం తొలుత ఎనిమిది మందికి సెక్యూరిటీని రద్దు చేసింది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్; బీజేపీ నేత సునీల్ జాఖడ్‌లు ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో ఐదుగురికి జెడ్ సెక్యూరిటీ లెవెల్ ఉంది. మిగతా ముగ్గురికి వై ప్లస్ గ్రూప్ సెక్యూరిటీ ఉంది. ఈ ఎనిమిది మందిని 127 మంది పోలీసు అధికారులు గార్డ్ చేశారు. తొమ్మిది పోలీసు వాహనాలు వీరి రక్షణ కోసం పని చేశాయి.
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, లోక్ సభ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, మాజీ కాంగ్రెస్ ఎంపీ సునీల్ జాఖడ్, కేంద్ర మాజీ క్యాబినెట్ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాలు సెక్యూరిటీ కవర్ ఎత్తేసిన జాబితాలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు పర్మింద్ సింగ్ పింకీ, రాజిందర్ కౌర్ భట్టాల్, నవతేజ్ సింగ్ చీమ, కేవాల్ సింగ్ ధిల్లియన్‌లు ఈ లిస్టులో ఉన్నారు.
పంజాబ్ ప్రభుత్వం తొలి రెండు ఆదేశాల్లో 184 మంది వీఐపీలకు సెక్యూరిటీ కవర్ రద్దు చేసింది. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్నారు.
కాగా, ఇటీవలే పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తన సొంత క్యాబినెట్ సభ్యుడిని బర్తరఫ్ చేశారు. పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను బలపరిచే స్పష్టమైన ఆధారం లభించిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. టెండర్లపై ఒక శాతం కమీషన్ ఇవ్వాలని మంత్రి విజయ్ సింగ్లా డిమాండ్ చేసినట్టు అవినీతి ఆరోపణలు వచ్చాయి. విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రాగానే సీఎం భగవంత్ మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఒక్క శాతం అవినీతిని కూడా తాము ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ ప్రజలు ఎన్నో ఆశలతో ఆప్ ప్రభుత్వానికి ఓటు వేశారని ఆయన వివరించారు.ఈ ఆరోపణలను విజయ్ సింగ్లా అంగీకరించినట్టూ ఆయన పేర్కొన్నారు. అందుకే అవినీతి చేసినట్టు ఆధారాలు లభించిన మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఆరోగ్య శాఖ మంత్రి విజయ్త సింగ్లా తన శాఖలోనే అవినీతికి పాల్పడ్డారని, ఆ అవినీతిని స్వయంగా సింగ్లా ఒప్పుకున్నాడని తెలిపారు.