పుల్వామా అమర జవానులకు నివాళి.. ఆ ఉగ్రదాడితో లింక్ ఉన్న చివరి టెర్రరిస్టు హతం

By Mahesh KFirst Published Jan 1, 2022, 7:22 PM IST
Highlights

2019 ఫిబ్రవరి 14న జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఈ దాడితో ప్రమేయం ఉన్న ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. తాజాగా, ఈ పుల్వామా అటాక్‌తో ప్రమేయం ఉన్న చిట్టచివరి ఉగ్రవాదినీ అనంత్‌నాగ్‌లోని గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి.
 

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌(Jammu Kashmir)లోని పుల్వామాలో సుమారు 40 మంది జవానులను ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడితో పొట్టనబెట్టుకున్న ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ ఘటన 2019లో జరిగింది. ఆ ఆత్మాహుతి దాడితో సంబంధమున్న చివరి టెర్రరిస్టును ఇటీవలే జమ్ము కశ్మీర్ ఎన్‌కౌంటర్‌(Encounter)లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా దాడి(Pulwama Attack)తో లింక్ ఉన్న చివరి టెర్రరిస్టు ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. దీంతో పుల్వామా అమర జవానులకు ఇది నివాళిగా ప్రజలు భావిస్తున్నారు.

2019లో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి చేసిన ఘటనతో సంబంధం ఉన్న చివరి ఉగ్రవాదిని అనంత్‌నాగ్‌లోని ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. డిసెంబర్ 30వ తేదీన అనంత్‌నాగ్‌లోని దూరు దగ్గర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో టాప్ జైషే మహమ్మద్ టెర్రరిస్టు సమీర్ దార్‌ను హతమార్చినట్టు ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఆ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మరణించారు. అందులో సమీర్ దార్ కూడా ఒకరు. సమీర్ దార్ ఫొటో.. పోలీసు రికార్డుల్లోని ఫొటోలతో పోలి ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే, ఆయన డీఎన్ఏ టెస్టు చేసిన తర్వాత సమీర్ దార్ ఐడెంటినీ ధ్రువీకరించారు. పుల్వామా దాడితో ప్రమేయం ఉన్న చివరి టెర్రరిస్టు సమీర్ దార్ కూడా హతం అయ్యాడని అధికారులు స్పష్టం చేశారు. ఆ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురిలో ఇద్దరు ఇక్కడి స్థానికులే. కాగా, ఒకరు పాకిస్తాన్ జాతీయుడు.

Also Read: జమ్మూకాశ్మీర్ : పుల్వామాలో ఎన్​కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్‌లో భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల భరతం పడుతున్నారు. ఉగ్రవాదుల కదలికల సమాచారం అందగానే వారిని పట్టుకోవడానికి బృందాలుగా వెళ్లుతున్నారు. ఇలాంటి సమాచారంతోనే బుధవారం భద్రతా బలగాలు అనంత్‌నాగ్, కుల్గాంలలో కూంబింగ్‌కు బయల్దేరారు. ఈ క్రమంలోనే రెండు చోట్లా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జరిగిన ఫైరింగ్‌లో ముగ్గురు మరణించారు.

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు.. 2019లో ఫిబ్రవరిలో జమ్ము కశ్మీర్ దద్దరిల్లింది. భద్రతా బలగాలు వెళ్తున్న కాన్వాయ్‌పైకి పేలుడు పదార్థాలతో లోడ్ చేసుకుని ఓ కారు దూసుకువచ్చింది. జేషే మహ్మద్ టెర్రరిస్టు ఆ కారును వేగంగా తీసుకువచ్చి సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌తో ఢీకొట్టాడు. అంతే.. ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది. అందులో 40 మంది జవాన్లు మరణించారు. ఆ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల సీరియస్‌గా వ్యవహరించింది. భద్రతా బలగాలు ఒక్కొక్కరిగా ఆ ఘటనతో సంబంధం ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

Also Read: పుల్వామా వంటి మరో దాడికి జైషే కుట్ర: నిఘా సంస్థల హెచ్చరిక

పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్‌ జవానులు అమరులైన ఘటనపై ప్రపంచదేశాలు భారత్‌కు మద్ధతుగా నిలుస్తున్నాయి. ఇంతటి మారణహోమానికి తామే కారణమంటూ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది.

అంతేకాకుండా ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది వీడియోను సైతం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. మరోవైపు పుల్వామా ఉగ్రదాడి వెనుక పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌లోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ, వారికి ఆర్ధికంగా, ఆయుధపరంగా సాయం చేస్తోంది.

click me!