
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన పార్టీలో తీవ్ర కలకలం రేగింది. ఏకంగా పార్టీ ఎవరిది అనే స్థితికి రాజకీయాలు చేరాయి. రియల్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానిదేనని.. కాదు ఏక్‌నాథ్ షిండే వర్గానిదేనని మరికొందరు చెబుతున్నారు. తమదే రియల్ శివసేన అంటే తమదేనని ఈ రెండు వర్గాలూ వాదిస్తున్నాయి. ఈ పంచాయితీ ఇప్పుడు ఎన్నికల సంఘం ముందుకు చేరింది. శివసేన పార్టీ తమదేనని పేర్కొంటూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్‌నాథ్ షిండే వర్గం ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాశాయి.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ ఈ రెండు వర్గాలకు ఆదేశాలు జారీ చేసింది. శివసేన పార్టీకి ఎవరు సారథ్యం వహించాలో చెప్పే ఆధారాలు, రుజువులను డాక్యుమెంటరీ రూపకంగా సమర్పించాలని ఆదేశించింది. తమ వద్దే మెజార్టీ శివసేన సభ్యులు ఉన్నారనే ఆధారాలనూ సమర్పించాలని తెలిపింది. ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 1 గంటల్లోపు తమ డాక్యుమెంట్లు సమర్పించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత రియల్ శివసేన ఎవరిది అనే దానిపై వాదనలు వింటామని తెలిపింది.
ఉద్ధవ్ ఠాక్రే క్యాంప్ సభ్యుడు అనిల్ దేశాయ్ పలుమార్లు ఈసీఐకి లేఖలు రాశారు. తమ పార్టీకి చెందిన కొందరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఏక్‌నాథ్ షిండే, గులాబ్‌రావ్ పాటిల్, తాాంజి సావంత్, ఉదయ్ సామంత్‌లను పార్టీ పదవుల నుంచి తొలగించాలని కోరారు. అంతేకాదు, షిండే వర్గం శివసేన, లేదా బాలా సాహెబ్ పేరుతో పార్టీని స్థాపిస్తే తమకు అభ్యంతరకరం అని స్పష్టం చేశారు.
కాగా, ఏక్‌నాథ్ షిండే వర్గం తమకు మొత్తం 55 పార్టీ ఎమ్మెల్యేల్లో 40 మంది తమతోనే ఉన్నారని, ఎమ్మెల్సీలు ఉన్నారని, అంతేకాదు, మొత్తం 18 మంది ఎంపీల్లో 12 మంది తమ వెంటే ఉన్నారని ఈసీఐకి తెలిపారు. ఎలక్షన్ సింబల్స్ ఆదేశం 1968 ప్రకారం ఏక్‌నాథ్ షిండే వర్గం తమకు పార్టీ సింబల్ విల్లు ధనుస్సు తమకే కేటాయించాలని కోరారు.