
Remarks On Prophet Muhammad: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇప్పటికే పలు ముస్లిం దేశాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించగా.. పలు దేశాలు మన దేశాల ఉత్పత్తులను బహిష్కరించాయి. ఈ క్రమంలో నిరసనగా.. భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్‌సైట్లను సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకూ భారత్ కు చెందిన 70 వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ను హ్యాక్‌కు గురయ్యాయి.
తొలుత మలేషియాకు చెందిన హ్యాకర్లు నాగ్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వెబ్‌సైట్‌ను ఆదివారం హ్యాక్ చేసినట్టు గుర్తించారు. డ్రాగన్‌ఫోర్స్ మలేషియా, 1877 సంస్థ, కురుదేశ్ కోరడర్స్ పేరుతో హ్యాక్ చేసినట్టు గుర్తించారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన అగ్రిటెక్ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోర్టల్స్, భవన్స్ స్కూల్ హ్యాక్‌కు గురయ్యాయి. అంతేకాకుండా కొన్ని బ్యాంకింగ్ వెబ్‌సైట్లు కూడా హ్యాక్‌కు గురయ్యాయి.
ఇప్పటికే .. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారత్‌పై ఆత్మాహుతి దాడులు చేస్తామని అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు దిగింది. ఇప్పుడు భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రయివేట్ వెబ్‌సైట్లను టార్గెట్ చేస్తూ.. సైబర్ అటాక్ కు పాల్పడుతున్నారు. ఈ దాడిలో మహారాష్ట్రకు చెందిన 50 పైగా సంస్థల వెబ్ సైట్లు హ్యాక్‌కు గురైనట్లు సమాచారం. అలాగే జూన్ 8 నుంచి 12 వరకు
అనేక ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల పోర్టల్స్ హ్యాక్ అయినట్లు సైబర్ నిపుణులు భావిస్తోన్నారు. ఈ వైబ్ సైట్లను ఇంకా పునరద్దరించలేకపోయారు.
ఈ దాడులతో వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయిల్ ప్రభుత్వానికి చెందిన వెబ్‌సైట్లపై సైబర్ దాడులు జరిగినప్పుడు.. ఆ దేశానికి చెందిన పౌరుల వ్యక్తిగత సమాచారం లీక్ చేసినట్లు తెలుస్తోంది. వెబ్‌సైట్ల నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసుకోవడమే పరిష్కారమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ హ్యాకర్ గ్రూప్ లో మొత్తం 13వేల సభ్యులున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలోని ప్రముఖ బ్యాంకు వెబ్‌సైట్లు, ప్రముఖ కంపెనీల వెబ్‌సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నం చేసినట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు.
పోలీస్ ఇన్‌స్పెక్టర్ (సైబర్) నితిన్ ఫతంగారే మాట్లాడుతూ.. వెబ్‌సైట్ హోమ్ పేజీలో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించమని ప్రజలను కోరుతూ సందేశం ఉందని చెప్పారు. ముహమ్మద్ ప్రవక్త అవమానానికి వ్యతిరేకంగా.. ఈ దాడులు చేస్తున్నట్టు సైబర్ నేరగాళ్లు పేర్కొంటున్నారు. ముంబైలో శనివారం కూడా ఇలాంటి కేసు తెరపైకి వచ్చిందని ఫతంగారే చెప్పారు. అప్పటి నుంచి అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు.
ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత.. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రదర్శనలు జరిగాయి. దీంతో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇండోనేషియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, జోర్డాన్, బహ్రెయిన్, మాల్దీవులు, మలేషియా, ఒమన్, ఇరాక్, లిబియా తదితర దేశాలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి.
నుపుర్‌పై కేసులు
ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత నూపుర్ శర్మపై పలు కేసులు నమోదయ్యాయి. జూన్ 25న తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు నూపుర్ శర్మకు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. రజా అకాడమీ ఫిర్యాదు మేరకు పైడోనీ పోలీసులు నూపూర్ శర్మపై కేసు నమోదు చేశారు.
నూపుర్‌పై గతంలో ముంబై, థానే, పైడోనిలో కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు, వాతావరణాన్ని చెడగొట్టినందుకు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్, షాదాబ్ చౌహాన్ మరియు మౌలానా ముఫ్తీ నదీమ్‌లతో సహా 9 మందిపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సైబర్ యూనిట్ కేసు నమోదు చేసింది.