ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కారును అడ్డుకోవడంతో ఉద్రిక్తత..సెల్పీలు దిగిన మహిళా పోలీసుల

By team teluguFirst Published Oct 20, 2021, 5:55 PM IST
Highlights

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక  గాంధీ వాద్రాను (Priyanka Gandhi Vadra) ఉత్తరప్రదేశ్ పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. పోలీసు  కస్టడీలో  మరణించిన వ్యక్తి కుటుంబాన్ని  పరామర్శించేందుకు ఆగ్రాకు (Agra) బయలుదేరిన  ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. 

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక  గాంధీ వాద్రాను (Priyanka Gandhi Vadra) ఉత్తరప్రదేశ్ పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. పోలీసు  కస్టడీలో  మరణించిన వ్యక్తి కుటుంబాన్ని  పరామర్శించేందుకు ఆగ్రాకు (Agra) బయలుదేరిన  ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేలోని  మొదటి టోల్ ప్లాజా వద్ద పోలీసులు  ఆమె  కారును నిలిపివేశారు. అనంతరం ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకుని లక్నో పోలీస్ లైన్స్  తరలించేందుకు యత్నిస్తున్నారు. పోలీసులు  తనను అదపులోకి తీసుకునే సమయంలో ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.   ‘నేను ఇంట్లో ఉన్నాఒకే, ఆఫీస్‌కు  వెళ్లినా ఒకే..  కానీ నేను వేరే చోటుకు వెళ్లాలనుకున్నప్పుడు  ఈ తమాషా మొదలుపెడతారు. నేను కుటుంబాన్ని కలవడానికి వెళ్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నారు. ఈ చర్యల ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. ఎంత ట్రాఫిక్  జామ్ అయిందో చూడండి.. ఇది చాలా హాస్యస్పదంగా ఉంది..  ’అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. 

దేశంలో స్వేచ్చగా తిరగడం అనేది తన రాజ్యాంగపరమైన హక్కు అని ప్రియాంక గాంధీ అన్నారు. తాను  విడుదలైన వెంటనే ఎంత త్వరగా  వీలైతే అంత త్వరగా పోలీసు కస్టడీలో మృతిచెందిన వ్యక్తి కుటుంబాన్ని  కలవాలని  నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు.

తనను  ఆగ్రా వెళ్లకుండా అడ్డుకోవడంపై ట్విట్టర్  వేదికగా  కూడా ప్రియాంక స్పందించారు. ప్రభుత్వం దేనికి భయపడుతుంది అని ప్రశ్నించారు. ‘అరుణ్ వాల్మీకి పోలీసు కస్టడీలో మరణించాడు. అతని కుటుంబం న్యాయం కావాలని కోరుతోంది. నేను ఆ కుటుంబాన్ని కలవాలని  అనుకుంటున్నాను. యూపీ ప్రభుత్వం దేనికి భయపడుతోంది?,  పోలీసులు నన్ను ఎందుకు ఆపుతున్నారు? ఈ రోజు వాల్మీకి జయంతి ... బుద్ధుడిపై ప్రధాని మోదీ చాలా బాగా మాట్లాడారు. కానీ ఇక్కడి చర్యలు మోదీ సందేశంపై దాడి చేస్తున్నాయి’అని ప్రియాంక పేర్కొన్నారు. 

ఇక, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు..  రాజకీయ  నాయకులు  నగరంలోకి  ప్రవేశించకుండా లా అండ్ ఆర్డర్ సమస్యలను పేర్కొంటూ ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. ఆ ఉత్తర్వుల ప్రకారం  ఆమెను  నిలిపివేసినట్టుగా చెప్పారు. ప్రియాంకను  పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొందరు  కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదిలా ఉంటే ప్రియాంక  గాంధీతో అక్కడున్న కొందరు మహిళ పోలీసులు సెల్పీలు దిగుతూ  కనిపించారు. 

పోలీసు శాఖకు చెందిన ఓ భవనంలో  క్లీనర్‌గా పనిచేస్తున్న అరుణ్.. అక్కడి నుంచి శనివారం రాత్రి డబ్బు దొంగిలించాడనే ఆరోపణలపై పోలీసులు అతడిని అరెస్ట్  చేశారు. అయితే  మంగళవారం  రాత్రి అనారోగ్యానికి గురైన అరుణ్.. ఆస్పత్రికి తరలించేలోపే మరణించినట్టుగా  పోలీసులు  చెప్పారు. అరుణ్ మృతదేహానికి  పోస్ట్‌మార్టమ్  నిర్వహించిన  అనంతరం.. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు.

click me!