ఢిల్లీ మేయర్‌గా రెండో సారి ఎన్నికైన ఆప్ నాయకురాలు షెల్లీ ఒబెరాయ్..

By Sumanth KanukulaFirst Published Apr 26, 2023, 12:59 PM IST
Highlights

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) నూతన  మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ రోజు జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ మేయర్‌గా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ మరోసారి మేయర్‌గా ఎన్నికయ్యారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) నూతన  మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ రోజు జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ మేయర్‌గా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ మరోసారి మేయర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ నామినేషన్‌ ఉపసంహరించుకుకోవడంతో షెల్లీ ఒబెరాయ్‌ ఎన్నిక ఏకగ్రీవం అయింది. స్టాండింగ్ కమిటీకి ఎన్నిక నిర్వహించనందున తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు శిఖా రాయ్ సభలో తెలిపారు. ఇక, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వికి బీజేపీ నుంచి పోటీప‌డ్డ సోనీ పాండే కూడా చివ‌రి నిమిషంలో త‌ప్పుకున్నారు. దీంతో ఆప్‌కు చెందిన ఆలే మ‌హ్మ‌ద్ ఇక్బాల్ రెండోసారి డిప్యూటీ మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు.

మేయర్ ఎన్నికకు ఆప్ సీనియర్ కౌన్సిలర్ ముఖేష్ గోయల్ ప్రిసైడింగ్ అధికారిగా నిలిచారు. గోయల్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యంత సీనియర్ కౌన్సిలర్‌గా ఉన్నారు. ఇక, షెల్లీ ఒబెరాయ్ ఫిబ్ర‌వ‌రి 22వ తేదీన  తొలిసారి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు. అప్పుడు ఆమె 34 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై గెలుపొందారు.

Latest Videos

ఇక, ఎంసీడీలో మేయర్ పదవి సంవత్సరం చొప్పున ఐదేళ్ల పాటు రొటేషనల్ ప్రాతిపదికన ఉంటుంది. మొదటి సంవత్సరం మహిళలకు, రెండో ఏడాది ఓపెన్ కేటగిరీకి, మూడో ఏడాది రిజర్వ్‌డ్ కేటగిరీకి, ఆ తర్వాత మిగిలిన రెండు ఏళ్లు మళ్లీ ఓపెన్ కేటగిరీకి రిజర్వ్ చేయబడ్డాయి. 

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ కోసం ఎన్నికలు రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించబడతాయి. ఫిరాయింపు నిరోధక చట్టాలు వర్తించవు. ఎలక్టోరల్ కాలేజీ‌ 250 మంది ఎన్నికైన కౌన్సిలర్లు, 14 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలతో రూపొందించబడింది. డిసెంబర్ 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 250 మునిసిపల్ వార్డులలో ఆప్ 134 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. 

click me!