ప్రియాంక గాంధీ నన్ను జైలులో కలిశారు.. ఆమె తండ్రి హత్య గురించి అడిగి ఏడ్చేశారు.. : నళిని

By Sumanth KanukulaFirst Published Nov 13, 2022, 5:19 PM IST
Highlights

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా నళిని శ్రీహరన్‌తో పాటు మరో ఐదుగురి విడుదలకు శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నళిని శనివారం వెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా నళిని శ్రీహరన్‌తో పాటు మరో ఐదుగురి విడుదలకు శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నళిని శనివారం వెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన నళిని పలు విషయాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తనను జైలులో కలిశారని.. ఆమె తండ్రి రాజీవ్ గాంధీ హత్యపై ప్రశ్నించారని చెప్పారు. ఆ సమయంలో ప్రియాంక ఆమె తండ్రిని గుర్తుచేసుకుని గాంధీ భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు. 

‘‘ప్రియాంక గాంధీ నన్ను జైలులో కలుసుకున్నారు. ఆమె తన తండ్రి హత్య గురించి నన్ను అడిగారు. ఆమె తన తండ్రి కోసం భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఏడ్చేశారు’’ అని నళిని చెప్పారు. అలాగే తన భర్త శ్రీహరన్ అలియాస్ మురుగన్‌ను తిరుచ్చి ప్రత్యేక శిబిరం నుంచి వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నళిని  తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

‘‘సోమవారం నేను తిరుచ్చి ప్రత్యేక శిబిరంలో నా భర్తను కలవబోతున్నాను. మా కూతురు విదేశాల్లో ఉంటుంది. నా కుమార్తె తన తండ్రిని కలవడానికి చాలా ఉత్సాహంగా ఉంది. నేను నిజంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు వెళ్లి చూడాలనుకుంటున్నాను. ప్రధానంగా దివంగత కమలా సర్ మెమోరియల్‌ను చూడాలని ఉంది. నేను నా భర్తను ఇంకా కలవలేకపోతున్నాను.. అందుకే ప్రస్తుతం సంతోషంగా లేను. అతన్ని వీలైనంత త్వరగా శిబిరం నుంచి విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను’’ అని నళిని చెప్పారు. ఈ కేసు నుంచి  బయటపడేందుకు తనకు సహకరించిన వారందరినీ కలవాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. 

త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలవాలని అనుకుంటున్నట్టుగా నళిని చెప్పారు. వారిని ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు. గాంధీ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. వారిని కలిసే అవకాశం దొరికితే తాను వారిని కలవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. 

Also Read: రాజీవ్ గాంధీ హత్య కేసు: జైలు నుంచి బయటకు వచ్చిన నళిని ఫస్ట్ కామెంట్ ఇదే.. ప్రజా జీవితంపై కీలక వ్యాఖ్య

ఇక, తన జైలు జీవితం గురించి వివరిస్తూ.. ‘‘మమ్మల్ని మరణశిక్ష పడినవారి మాదిరిగానే జైలులో చూశారు. నేను రెండు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా నన్ను జైలులో బంధించారు’’ అని నళిని చెప్పారు. అయితే భవిష్యత్తులో తాను కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తానని ఆమె తెలిపారు. తన జీవితం మొత్తం ఇప్పటికే నాశనమైందనీ.. ఇకపై తాను కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోబోతున్నానని పేర్కొన్నారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినితో పాటు మరో ఐదుగురిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో దోషుల్లో ఒకరైన ఏజీ పెరరివాలన్‌కు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వీరి విషయంలో కూడా వర్తిస్తుందని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్నలతోధర్మాసనం పేర్కొంది. సుప్రీం ఆదేశాలతో రాజీవ్ హత్య కేసులో దోషులైన నళిని, ఆమె భర్త మురుగన్ అలియాస్ శ్రీహరన్, సంతన్, జయకుమార్, రవిచంద్రన్, రాబర్ట్ పయస్‌లకు భారీ ఊరట లభించింది. ఇక, ఈ కేసులో దోషులు తమను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ సుదీర్ఘ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

click me!