
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు టికెట్ ఇవ్వనందుకు అసంతృప్తిగా వున్న ఆప్ మాజీ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్ ఆదివారం స్థానిక శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాన్స్‌మిషన్ టవర్ ఎక్కి కలకలం రేపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు.
డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌కు జరగనున్న ఎన్నికల కోసం 117 మంది అభ్యర్ధులతో ఆమ్ ఆద్మీ పార్టీ తన రెండో , చివరి జాబితాను శనివారం ప్రకటించిన తర్వాత ఇది జరిగింది. బయటకొచ్చిన అన్ని సర్వేలలో అగ్రస్థానంలో నిలిచిన తర్వాత అభ్యర్ధుల రెండవ జాబితాలో పాత పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆప్ పేర్కొంది. ఇదే చివరి జాబితా కావడంతో ఇక తనకు టికెట్ రాదని హసన్ తీవ్ర నిరాశతో ఈ చర్యకు దిగినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు .. ఈ ఘటన నేపథ్యంలో ఆప్ నేతలు స్పందించారు. టికెట్ల కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరించామని చెబుతున్నారు. ప్రజల సూచనల మేరకు సర్వే ఫలితాల ఆధారంగా టికెట్లు కేటాయించినట్లు ఆప్ చెబుతోంది. కాగా.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 20,000 మంది ఆప్ కార్యకర్తలు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన అప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సుదీర్ఘ కసరత్తు అనంతరం అభ్యర్ధులను ఖరారు చేసింది.