విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి బుద్ధి గడ్డి తిన్నది. పాఠశాలకు ప్రిన్సిపాల్ గా ఉన్న అతడు.. 50 మంది బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఆయన ఓ స్కూల్ కు ప్రిన్సిపాల్.. చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన వ్యక్తి.. కామంతో కళ్లుమూసుకుపోయి నీచంగా ప్రవర్తించాడు. దాదాపు 50 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. దీంతో తాజాగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి. జింద్ జిల్లాలోని ఓ పాఠశాలలో 55 ఏళ్ల వ్యక్తి ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. అతడు తరచూ విద్యార్థినులను తన కార్యాలయానికి పిలిపించుకొని, వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అతడి ఆగడాలు భరించలేక దాదాపు 50 మంది విద్యార్థినులు అధికారులకు లేఖలు రాశారు. దీంతో అధికారులు వాటిని సెప్టెంబర్ 14వ తేదీన పోలీసులకు పంపించారు. విద్యాశాఖ అతడిని అక్టోబర్ 27న సస్పెండ్ చేసినా.. మరే ఇతర చర్యలు తీసుకోలేదు.
ఈ ఫిర్యాదులపై మహిళా కమిషన్ జోక్యం చేసుకోవడంతో తాజాగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై హర్యానా మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేణు భాటియా మాట్లాడుతూ.. ‘‘ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ 60 మంది విద్యార్థులు రాసిన లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయి. ఇందులో 50 మంది బాలికలు ప్రిన్సిపాల్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులు. మిగిలిన పది మంది ప్రిన్సిపాల్ చేసిన లైంగిక వేధింపులు తమకు తెలుసని పేర్కొన్నారు. బాలికలను అతడు తన కార్యాలయానికి పిలిపించుకొని అశ్లీల చర్యలకు పాల్పడేవాడు’’ అని తెలిపారు.
ఈ ఘటనలో మహిళా జిల్లా విద్యాధికారి తప్పిదంపై కూడా కమిషన్ విచారణ జరుపుతోందని, ఫిర్యాదులు వచ్చినప్పుడు ఆమె ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలుసుకోవడానికి కమిషన్ దర్యాప్తు చేస్తోందని భాటియా తెలిపారు. ప్రిన్సిపాల్ కు సహకరించిన ఓ మహిళా ఉపాధ్యాయురాలి పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా..ప్రిన్సిపాల్ పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354-ఎ (లైంగిక వేధింపులు), 341 (తప్పుడు నిర్బంధం), 342 (అక్రమ నిర్బంధం), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.