హిమాచ‌ల్ లో ముందుగానే దీపావ‌ళి వ‌చ్చిందన్న ప్రధాని మోడీ.. ఉనాలో ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాపన

Published : Oct 14, 2022, 03:09 AM IST
హిమాచ‌ల్ లో ముందుగానే దీపావ‌ళి వ‌చ్చిందన్న ప్రధాని మోడీ.. ఉనాలో ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాపన

సారాంశం

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ పర్య‌ట‌న సంద‌ర్భంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఉనాను ప్రధాని మోడీ ప్రారంభించారు. దీనికి 2017లో ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే, ఉనా రైల్వే స్టేషన్ నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి, హమీర్‌పూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.  

PM Narendra Modi: ఉనాలో ఫార్మా, విద్య, కనెక్టివిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ.. హిమాచల్ ప్రదేశ్ కు దీపావళి పండుగ ముందుగానే వచ్చిందని చెప్పారు. అలాగే, చంబాలో 2 జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులు ఏటా 270 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. హిమాచల్ వీటి ద్వారా దాదాపు ₹ 110 కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది.

వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌ధాని న‌రేంద్ మోడీ.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం చుట్టారు. వివిధ ప్రాజెక్టులను ప్రారంభించ‌డంతో పాటు శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మాట్లాడుతూ.. ఉనా, హిమాచల్ ప్రదేశ్ లకు దీపావళి పండుగ ముందుగానే వచ్చిందని అన్నారు. "ధంతేరాస్, దీపావళికి ముందు హిమాచల్ కు కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన బహుమతులను ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. ఈ రోజు నేను కొత్త వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించాను. దేశంలో ప్రవేశపెట్టిన నాలుగో వందే భారత్ రైలు ఇది. చాలా సంతోషంగా ఉంది" అని ప్ర‌ధాని మోడీ అన్నారు. 

అలాగే, కాంగ్రెస్ పై విమర్శ‌లు గుప్పించిన ప్ర‌ధాని మోడీ.. "నాకు హిమాచల్ పరిస్థితి గుర్తుంది. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. హిమాచల్‌లో మునుపటి ప్రభుత్వాలు, ఢిల్లీలో కూర్చున్న ప్రభుత్వాలు కూడా మీ అవసరాలను తీర్చడంలో ఉదాసీనంగా ఉన్నాయి. వారు మీ ఆశలను, ఆకాంక్షలను ఎప్పటికీ అర్థం చేసుకోలేక‌పోయారు" అని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దేశంలో మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌ని చెప్పారు. ప్రజల ఆకాంక్షల కోసం, కొత్త మౌలిక సదుపాయాలను నిర్మించే దిశగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని అన్నారు.

ఉనాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ.. ఫార్మా పార్క్ దాదాపు రూ. 2,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని చెప్పారు. "ముడి పదార్థాలు, ఉత్పత్తి రెండూ హిమాచల్ ప్రదేశ్‌లో తయారైనప్పుడు మందులు చౌకగా మారతాయి" అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం 20వ శతాబ్దపు ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా, 21వ శతాబ్దపు ఆధునిక సౌకర్యాలను హిమాచల్‌లో ప్రతి ఇంటికీ తీసుకువస్తోందని చెప్పారు. "గ్రామీణ రహదారుల అభివృద్ధి, నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల లభ్యతతో పాటు డిజిటల్ మౌలిక సదుపాయాలలో పురోగతి ఎల్లప్పుడూ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉంటుంది. కొత్త భారతదేశం గత సవాళ్లను అధిగమించి వేగంగా అభివృద్ధి చెందుతోంది" అని ప్రధాని మోడీ  అన్నారు.

గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని హైలైట్ చేస్తూ, హిమాచల్‌లో గ్రామీణ రహదారులను రెట్టింపు వేగంతో నిర్మిస్తున్నారనీ, అదే సమయంలో గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ కూడా వేగంగా అందించబడుతుందని తెలిపారు. ఫార్మాస్యూటికల్ రంగానికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో, హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాని మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకారం రూ.1,900 కోట్లకు పైగా వ్యయంతో డ్రగ్ పార్క్‌ను నిర్మించనున్నారు. క్రియాశీల ఔషధ పదార్ధాల (API) దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో పార్క్ సహాయం చేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దాదాపు రూ. 10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందనీ, 20,000 మందికి పైగా ఉపాధి కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఇది ఊతమిస్తుందని పీఎంవో ప్రకటన తెలిపింది.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఉనాను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. దీనికి 2017లో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే, ఉనా రైల్వే స్టేషన్ నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి, హమీర్‌పూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్