
Ariyalur district: అభిమానం హద్దులు మీరింది. అభిమానం ఉన్మాదంగా మారి ఏకంగా స్నేహితుడి ప్రాణాలను తీసేలా చేసింది. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను తిట్టాడని స్నేహితుడుని చంపాడు ఓ అభిమాని. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకునీ, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
ఈ ఘటన గురించి స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి తప్పుగా మాట్లాడిన యువకుడిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణానికి పాల్పడింది తన మిత్రుడు కావడం గమనార్హం. అరియలూరు జిల్లా పొయ్యూరు గ్రామానికి చెందిన విఘ్నేష్ అనే యువకుడు బుధవారం ఉదయం ఊరి బయట అడవిలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల వెనుక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టిన గుర్తులు ఉన్నాయి. ఈ క్రమంలోనే కీజపావూరు పోలీసులు కేసు నమోదుచేసుకునీ, విచారణ చేపట్టారు.
పోలీసులు స్థానికులను విచారిస్తున్న క్రమంలో మృతుడు విఘ్నేష్ తన స్నేహితులతో కనిపించాడని చెప్పారు. విఘ్నేష్ తన స్నేహితులు ప్రభాకరన్, ధర్మరాజ్‌లతో కలిసి మద్యం సేవించాడని పోలీసులకు తెలిసింది. ఉదయం మద్యం సేవించి ఇంటికి చేరుకున్న విఘ్నేష్ ను స్నేహితులు ప్రభాకరన్, ధర్మరాజ్ మళ్లీ సాయంత్రం మద్యం తాగేందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత విఘ్నేష్ ఇంటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి విఘ్నేష్ కనిపించకుండా పోయాడు. అతని కోసం వెతుకగా, స్థానికంగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించాడు. అతని శరీరంపై బలమైన గాయాలు ఉన్నాయని గుర్తించారు.
ఇక పోలీసులు మృతుడు విఘ్నేష్ స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయం వెలగులోకి వచ్చింది. ఊరిబయట ఉన్న అడవిలో ముగ్గురు మద్యం సేవిస్తుండగా ధర్మరాజ్.. విఘ్నేష్ తలపై కొడవలితో కొట్టి హత్య చేసినట్లు సమాచారం. విఘ్నేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను విచారణలో హత్యకు గల కారణాన్ని అడిగినప్పుడు.. ధర్మరాజ్ హత్యకు కారణం స్టార్ క్రికెటర్ల విషయం గురించి చెప్పాడు. క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను విఘ్నేష్ దూషించాడని చెప్పాడు. అయితే, కేవలం క్రికెట్లపై ఉన్న అభిమానంతో స్నేహితుడి ప్రాణాలు తీశానని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.
ఘటన సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నీలాగే ఉన్నారనీ, అలాగే, దూషించాడని విఘ్నేష్ తనతో చెప్పాడనీ, ఆవేశంలో విఘ్నేష్‌ని హత్య చేశానని ధర్మరాజ్ అంగీకరించాడు. ఆ తర్వాత పోలీసులు ధర్మరాజును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ ఘటన ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ధర్మరాజ్ హత్యకు గల కారణాన్ని దాస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని చెప్పారు.
కాలేజీ విద్యార్థిని రైలు పట్టాలపైకి తోసేసిన యువకుడు.. !
తమిళనాడులో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చెన్నైలోని పరంగిమలై రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలపై తోసేసి యువతిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న సత్య(20) అనే విద్యార్థిని గురువారం పరంగిమలై రైల్వే స్టేషన్‌లో రైలు కోసం వేచి ఉంది. అయితే, అక్కడే ఉన్న ఆదంబాక్కంకు చెందిన సతీష్ (23) రైలు రాగానే సత్యను ట్రాక్‌పైకి తోసి పరారయ్యాడు. రైలు పట్టాలపై పడిన బాలికపై రైలు ఢీకొనడంతో బాలిక నుజ్జునుజ్జు అయింది. రైలు వెళ్లిపోయిన తర్వాత పట్టాలపై పడి ఉన్న విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకునీ, నిందుతుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.