దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికన కీలక ప్రకటన చేసారు. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రకటనకు సంబంధించి ప్రధాని ట్వీట్ చేసారు.
న్యూడిల్లీ : పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసారు. డిఆర్డివో శాస్త్రవేత్తలు మిషన్ దివ్యాస్త్రను రూపొందించినట్లు ప్రధాని ప్రకటించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్ (MIRV) టెక్నాలజీతో దేశీయంగానే అగ్ని-5 మిస్సైల్ ను రూపొందించినట్లు ప్రధాని ట్వీట్ చేసారు.
ఇవాళ(సోమవారం) అగ్ని-5 మిస్సైల్ ను శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రధాని మోదీ దీనిపై ప్రకటన చేసినట్లుగా సమాచారం. దేశీయ టెక్నాలజీతో రూపొందించిన ఈ అగ్ని -5 క్షిపణిని వాయుమార్గం ద్వారా ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ మిస్సైల్ తో ఏకకాలంలో వివిధ లక్ష్యాలను చేధించవచ్చని తెలుస్తోంది.
డిఆర్డివో (డిఫెన్స్ రీసెర్చ్ ఆండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) ఈ అగ్ని 5 క్షిపణిని రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఓ మహిళా శాస్త్రవేత్త వున్నట్లు తెలుస్తోంది. అనేక మంది మహిళలు ఈ ప్రాజెక్ట్ లో పనిచేసినట్లు సమాచారం.
మిషన్ దివ్యాస్త్ర ద్వారా రూపొందించిన అగ్ని-5 క్షిపణి చాలా ప్రత్యేకమైనదిగా తెలుస్తోంది. ఈ క్షిపణి రూపకల్పన ద్వారా ఇండియా మల్టిపుల్ ఇండడిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్ (ఎంఐఆర్వి) టెక్నాలజీ కలిగిన దేశాల సరసన చేసింది. ఈ మిస్సైల్ ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కావడమే కాదు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో దేశం మరో ముందడుగు వేసింది.