
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ (Ukraine)లో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో భారతదేశ భద్రతా సంసిద్ధత, ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులు, మన దేశంపై ప్రభావం వంటి అంశాలను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi) అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాని అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh), ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (External Affairs Minister S Jaishankar) తదితరులు హాజరయ్యారు.
ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ (NSA Ajit Doval), ఇతర సీనియర్ అధికారులతో పాటు, ఆర్మీ (Army), నేవీ (Navy), ఎయిర్‌ఫోర్స్ (Air Force)కు చెందిన ముగ్గురు చీఫ్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ (bjp) ఘన విజయం సాధించిన తరువాత గురువారం ప్రధాని మోడీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశానికి రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) రెండింటితో అవసరం ఉందని తెలిపారు. అయితే దేశం శాంతి వైపు ఉంటుందని ప్రధాని చెప్పారు. చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
‘‘ భారతదేశం యుద్ధంలో పాల్గొన్న దేశాలతో ఆర్థికంగా, భద్రతపరంగా, విద్యాపరంగా, రాజకీయంగా కూడా సంబంధం కలిగి ఉంది. భారతదేశం అనేక అవసరాలు ఈ దేశాలతో అనుసంధానించబడి ఉన్నాయి ’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తోంది. భారతదేశం శాంతి పక్షాన ఉంది. అన్ని సమస్యలు చర్చలతో పరిష్కరించబతాయని నేను అశిస్తున్నాను ’’ అని ప్రధాని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలైన తరువాత చాలా మంది వివిధ దేశాలకు చెందిన పౌరులు అక్కడ చిక్కుకుపోయారు. అయితే ఇందులో ఇండియాకు చెందిన స్టూడెంట్లు కూడా ఉన్నారు. వీరిని భారత్ ప్రత్యేకంగా ఆపరేషన్ గంగా (Operation Ganga) అనే మిషన్ నిర్వహించి ఇండియాకు తీసుకువచ్చింది. వీరి కోసం ప్రత్యేక తరలింపు విమానాలను ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న దాదాపు 18 వేల మందికి పైగా స్టూడెంట్లను ఈ ఆపరేషన్ గంగా మిషన్ ద్వారా మన దేశానికి తీసుకొచ్చారు. అయితే ఈ మిషన్ ఈ వారంలో ముగిసిపోయింది.
ఉక్రెయిన్ కు, రష్యాకు మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు భారత్ తరుఫున ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ (Russian President Putin)తో మాట్లాడారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులను ఇక్కడికి తీసుకొచ్చేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Ukraine President Zelensky)తో కూడా మాట్లాడారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మన దేశ విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడంలో సహాయం చేసేందుకు జెనీవా (Geneva), ఉక్రెయిన్ (Ukraine)లలో రెడ్ క్రాస్ తో కలిసి పని భారత్ పని చేసిందని వార్తా సంస్థ ANI నివేదించింది.