
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి నారాయణస్వామి రాజీనామా తరవాత ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సిఫారసు చేశారు.
ఇందుకు సంబంధించిన లేఖను ఆమె ఢిల్లీకి పంపారు. దీనికి కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోదముద్ర వేయడంతో ఇవాళ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also Read:పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన.. ఎల్జీ సిఫారసుకు కేంద్రం ఆమోదం
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించడం ఇది ఏడోసారి. మంగళవారం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి రాజీనామాను ఆమోదించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.
కాగా, ఇటీవల కాంగ్రెస్‌కు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడింది. కొత్తగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఆదేశించారు.
సోమవారం బలపరీక్షకు నారాయణ స్వామి సిద్ధమవ్వగా మరో ఇద్దరు రాజీనామా చేశారు. దీంతో అధికార కాంగ్రెస్ కూటమి బలం 12కి తగ్గింది. విశ్వాస పరీక్షలో విఫలమవ్వడంతో నారాయణ స్వామి రాజీనామా చేశారు.