
Presidential elections 2022-Gopalkrishna Gandhi: రాష్ట్రపతి ఎన్నికల 2022 రేసులో గోపాలకృష్ణ గాంధీ పేరు తెరపైకి వచ్చింది.అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ సారి రాష్ట్రపతి ఎన్నికల్లో పోరు రసవత్తరంగా ఉండనుందని ప్రస్తుత గణాంకాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఎందుకంటే.. ప్రతిపక్షాలు ఒక్కటిగా ముందుకు సాగితే అధికార పార్టీ అభ్యర్థిని ఓడించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అన్ని ప్రతిపక్షపార్టీలను ఏకం చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బుధవారం నాటు ప్రతిపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి గురించి చర్చించారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ తెరమీదకు వచ్చిందని సమాచారం. మమతా బెనర్జీ ఆయన పేరును ప్రతిపాదించారని తెలిసింది. అలాగే, ఫరూక్ అబ్దుల్లా పేరును కూడా ఆమె ప్రతిపాదించారు. ఇప్పటివరకు శరద్ పవార్ పేరుపై మాత్రమే ఏకాభిప్రాయం ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన నిరాకరించారు.
మీడియా నివేదికల ప్రకారం ప్రతిపక్ష నాయకులు గోపాల కృష్ణ గాంధీతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిగా పరిగణించాలని కోరారు. అయితే, దీనిపై ఓ మీడియా సంస్థ ఆయనను సంప్రదించగా... ఈ విషయంపై ఇప్పుడే వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు.
ఎవరు ఈ గోపాలకృష్ణ గాంధీ?
భారత స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ సేవలు వెలకట్టలేనివి. శాంతియుత మార్గంలో యావత్ భారతావనిని ఏకతాటిపైకి తీసుకువచ్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో విజయం సాధించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో గొప్ప నాయకులుగా పేరుగాంచిన మహాత్మా గాంధీ, సి రాజగోపాలాచారి ల మనవడు ఈ గోపాల కృష్ణ గాంధీ. ఏప్రిల్ 1945లో జన్మించిన గోపాలకృష్ణ గాంధీ.. విజయవంతమైన కెరీర్‌ను కొనసాగించారు. ఆయన రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. అలాగే, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన రచయిత, దౌత్యవేత్త మరియు ప్రజా మేధావి. అతను అనేక దినపత్రికలకు కాలమ్‌లు రాస్తున్నారు. గోపాల కృష్ణ గాంధీ 2017 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి వెంకయ్య నాయుడు చేతిలో ఓడిపోయారు.
తమిళనాడులో 1985 వరకు IAS అధికారిగా పనిచేసిన తర్వాత, గోపాల కృష్ణ గాంధీ.. వైస్-ప్రెజెంట్ కార్యదర్శిగా మరియు భారత రాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. అతను శ్రీలంకలో భారత హైకమీషనర్ మరియు నార్వేలో భారత రాయబారితో సహా అనేక దౌత్య పదవులను నిర్వహించారు. 2004 మరియు 2006 మధ్య, గాంధీ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా మరియు తరువాత బీహార్ గవర్నర్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఆయన హర్యానాలోని అశోక విశ్వవిద్యాలయంలో చరిత్ర మరియు రాజకీయ అంశాలను విద్యార్థులకు బోధిస్తున్నారు. నేతల అభ్యర్థనపై నిర్ణయం తీసుకునేందుకు గోపాలకృష్ణ గాంధీ మరింత సమయం కోరినట్లు సమాచారం. కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. దీంతో ఆయన తర్వాతి వారసుడిని ఎన్నుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.