నిర్భయ కేసు: వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి

By telugu teamFirst Published Feb 1, 2020, 10:52 AM IST
Highlights

నిర్భయ కేసులోని దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శనివారంనాడు తిరస్కరించారు. తనకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ అతను ఆ పిటిషన్ పెట్టుకున్నాడు.

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ పెట్టుకున్న మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. అతని క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరిస్తూ రాష్ట్రపతి శనివారం నిర్ణయం తీసుకున్నారు. 

తనకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. జీవిత కాలం జైలులో ఉంటూ కూడా తాను తన తల్లిదండ్రుల కోసం జీవించాలని అనుకుంటున్నానని, జైలు జీవితం, ఏళ్ల తరబడి పోరాటం తనకు ఇదివరకే పాఠం నేర్పిందని అతను తన మెర్సీ పిటిషన్ లో చెప్పుకున్నాడు. 

Also Read: నిర్భయ దోషుల ఉరిశిక్ష నిలుపుదల అందుకే: న్యాయమూర్తి

నిర్భయ దోషులకు విధించిన ఉరిశిక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. నలుగురు దోషులను ఈ రోజు శనివారం ఉరి తీయాల్సి ఉండింది. ఉరి తీయడానికి తీహార్ జైలులో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉండడంతో ఉరిశిక్ష అమలు వాయిదా పడింది.

తమ ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషులు పాటియాలా హౌస్ కోర్టులో పెట్టుకున్న పిటిషన్ పై వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదనల తర్వాత ఉరిశిక్షను వాయిదా వేస్తూ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: నిర్భయ కేసు: రేపు దోషులకు ఉరిశిక్ష లేదు, కోర్టు స్టే

ఉరిశిక్ష అమలుకు కొత్త తేదీని నిర్ణయించనున్నట్లు కోర్టు తెలిపింది. 2012 డిసెంబర్ లో ఆరుగురు వ్యక్తులు వైద్యవిద్యార్థినిపై అత్యాచారం చేసి, చిత్రహింసలు పెట్టారు. దాంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ఆరుగురు దోషుల్లో ఒక్కడు మైనర్ కావడంతో శిక్ష అనుభవించి జువెనైల్ హోం నుంచి విడుదలయ్యాడు. మరో దోషి జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. చివరకు నలుగురు దోషులు శిక్షను తప్పించుకోవడానికి న్యాయపరమైన వెసులుబాట్లను వాడుకుంటున్నారు.

Also Read: ఎంతకాలం కాపాడతారు.. కన్నీరుమున్నీరైన నిర్భయ తల్లి

click me!