Ram Nath Kovind: జడ్జిల ఎంపిక వ్యవస్థలో సంస్కరణలు అవసరం.. రాష్ట్రపతి కోవింద్ కీలక వ్యాఖ్యలు..

By team teluguFirst Published Nov 28, 2021, 11:38 AM IST
Highlights

జడ్జిల నియామకానికి సంబంధించి రాష్ట్రపత్రి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించే కొలీజియం వ్యవస్థకు (Judges appointing judges system) సంస్కరణ అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. 

ఆరేళ్ల క్రితం పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన జాతీయ న్యాయ నియామకాల సంస్థ (నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్-ఎన్‌జేఏసీ) రాజ్యాంగ విరుద్దమని సుప్రీం కోర్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ చట్టం చెల్లనేరదంటూ తీర్పు వెలువరించింది. దీంతో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం, బదిలీలకు సంబంధించి గతంలో అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ‌ కొనసాగుతుంది. అయితే తాజాగా జడ్జిల ఎంపిక ప్రక్రియకు సంబంధించి రాష్ట్రపత్రి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించే కొలీజియం వ్యవస్థకు (Judges appointing judges system) సంస్కరణ అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల ముగింపు సభ శనివారం స్థానిక విజ్ఞాన్‌ భవన్‌లో జరిగింది. 

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి.. న్యాయమూర్తుల ఎంపిక పద్ధతిని సంస్కరించాలని పిలుపునిచ్చారు. సివిల్‌ సర్వీసెస్‌ తరహాలో న్యాయమూర్తులను నియమించేందుకు ఆల్‌ ఇండియా జ్యుడీషియల్‌ సర్వీస్‌ (ఎఐజెఎస్‌) వంటివి తీసుకురావాలని అన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థకు పదోన్నతి విషయంలో.. All-India Judicial Service ద్వారా ఎంపిక చేయబడిన అట్టడుగు స్థాయి న్యాయమూర్తుల అవకాశాలు కల్పించాలని సూచించారు. 

న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో సంస్కరణలు “సంబంధిత సమస్య” అని రాష్ట్రపతి అన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను పలుచన చేయకుండా ప్రయత్నించాలని సూచించారు. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత చర్చలకు వీలుకాదని నేను దృఢమైన దృక్పథంతో ఉన్నాను. దాని స్థాయి తగ్గించకుండా.. ఉన్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను ఎంపిక చేయడానికి మెరుగైన మార్గం కనుగొనవచ్చు. (న్యాయమూర్తుల ఎంపిక) వ్యవస్థను సంస్కరించడానికి మెరుగైన సూచనలు కూడా ఉండవచ్చని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అంతిమంగా జస్టిస్ డెలివరీ యంత్రాంగం బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.

న్యాయమూర్తులు అత్యంత విచక్షణతో వ్యవహరించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. కోర్టు గదుల్లో వ్యాఖ్యలు చేసే సమయంలో న్యాయవ్యవస్థ సంయమనం పాటించాలని సూచించారు.  సోషల్‌ మీడియాలో న్యాయవ్యవస్థను దూషిస్తున్న తీరుపై ఆయన విచారం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో దాడి పెరగడానికి కారణమేమిటనే విషయాన్ని సమిష్టిగా పరిశీలించాలని అన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి భాగస్వాములంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

click me!