
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఒడిశాలోని పూరీలో పర్యటించారు. ఈ సందర్భంగా అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. పూరీలో జగన్నాథుని ఆశీర్వాదం కోసం ఒక సాధారణ భక్తురాలుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రెండు కిలోమీటర్ల దూరం నడిచారు. ఆలయం వైపు వెళుతుండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన కాన్వాయ్‌ను గ్రాండ్ రోడ్‌లోని బాలగండి చక్ దగ్గర ఆపి.. కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. ద్రౌపది ముర్ము వెంట ఆమె కుమార్తె, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ నేత సంబిత్ పాత్ర, సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. రాష్ట్రపతి నడుచుకుంటూ ఆలయానికి వెళ్తుండగా.. అక్కడి భక్తులు జై జగన్నాథ్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రపతి వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.
ఆలయానికి చేరుకున్న అనంతరం ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆలయం లోపల గడిపిన తర్వాత ఆమె బయటకు వచ్చి విజిటర్స్ బుక్‌పై సందేశంతో కూడిన సంతకం చేశారు. అనంతరం ఆమెకు ఆలయ ప్రాంగణంలో మహాప్రసాదం స్వీకరించారు.
ఈ ఏడాది జులైలో దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము తన సొంత రాష్ట్ర ఒడిశాలో పర్యటించడం ఇదే తొలిసారి. జగన్నాథ ఆలయంలో పూజలు చేసి ఆమె తన పర్యటనను ప్రారంభించారు. ఇక, రెండు రోజుల ఒడిశా పర్యటన నిమిత్తం అధ్యక్షుడు ముర్ము ఈ ఉదయం భువనేశ్వర్ చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న ఆమెకు విమానాశ్రయంలో గవర్నర్ గణేశిలాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. రాష్ట్రపతికి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.
ఇక, పూరి నుంచి తిరిగి భువనేశ్వర్ చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. భువనేశ్వర్‌కు తిరిగి వస్తారు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, నాయకుల విగ్రహాల ముందు నివాళులు అర్పిస్తారు. ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్ భువనేశ్వర్‌లో ఆమె గౌరవార్థం ఏర్పాటు చేయనున్న పౌర సన్మానంకు కూడా హాజరుకానున్నారు. నవంబర్ 11న ముర్ము భువనేశ్వర్‌లోని తపోబన్ హైస్కూల్, యూనిట్-II ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కుంతల కుమారి సబత్ ఆదివాసీ బాలికల హాస్టల్ యూనిట్-IIని సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో సంభాషిస్తారు. అనంతరం మధ్యాహ్నం న్యూఢిల్లీకి బయలుదేరే ముందు జయదేవ్ భవన్ నుంచి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ ప్రాజెక్టులను ఆమె ప్రారంభిస్తారు.