గర్భిణీకి హెచ్ఐవీ రక్తం.. రక్తదాత ఆత్మహత్యాయత్నం

By ramya neerukondaFirst Published Dec 28, 2018, 10:06 AM IST
Highlights

తన కారణంగా ఓ గర్భిణీకి హెచ్ఐవీ సోకిందని తెలియడంతో అతను మనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు.

తమిళనాడులో ఇటీవల ఓ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వెళ్లిన గర్భిణీ మహిళకు హెచ్ఐవీ సోకిన వ్యక్తి రక్తం ఎక్కించిన సంగతి కలకలం రేపిన సంగతి తెలిసిందే.  కాగా.. ఆమెకు రక్తదానం చేసిన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. తన కారణంగా ఓ గర్భిణీకి హెచ్ఐవీ సోకిందని తెలియడంతో అతను మనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... రామనాథపురం జిల్లా కముదికి చెందిన 19 ఏళ్ల యువకుడు శివకాశి బాణసంచా ప్రింటింగ్‌ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అనారోగ్యానికి గురైన ఇతని అన్నభార్య (వదిన) ప్రసవం కోసం శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఆమె అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది.

దీంతో సదరు యువకుడు నవంబరు 30వ తేదీన అదే ఆస్పత్రిలోని బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్లిరక్తం ఇచ్చాడు. యువకుడు ఇచ్చిన రక్తాన్ని బ్లడ్‌బ్యాంక్‌లో భద్రం చేసుకున్న సిబ్బంది, యథాలాపంగా మరో ప్యాకెట్‌లోని రక్తాన్ని అతని వదినకు ఎక్కించారు.

ఇదిలా ఉండగా, రక్త దానం చేసిన యువకుడు విదేశీ ఉద్యోగానికి వెళుతూ డిసెంబర్‌ 6వ తేదీన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందడంలో భాగంగా రక్తపరీక్షలు చేయించుకోగా హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. దీంతో కంగారుపడిన యువకుడు బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్లి విషయం చెప్పాడు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే అతడిచ్చిన రక్తం గర్భిణికి ఎక్కించడం జరిగిపోయింది. 

తన రక్తం వల్లనే గర్భిణి హెచ్‌ఐవీ రోగిగా మారిందని యువకుడు తీవ్రంగా కలతచెందాడు. బుధవారం రాత్రి ఇంటిలోని ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లిదండ్రులు అతడిని వెంటనే రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం అతడిని ఐసీయూలో ఉంచి తీవ్రచికిత్స అందిస్తున్నారు. తనకు జీవించాలని లేదంటూ వైద్యచికిత్సకు అతడు సహకరించడం లేదని వైద్యులు చెబుతున్నారు.

click me!