
ప్రధాని నరేంద్ర మోడీ (Modis security breach ) భద్రతా వైఫల్యం వెనుక పంజాబ్ (punjab govt) ప్రభుత్వ కుట్ర దాగి ఉందంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన కుట్ర అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ సర్కారు ప్రోటోకాల్ పాటించలేదని యోగి ఆదిత్యనాధ్ అన్నారు. మోడీ కాన్వాయ్ (modi convoy)ఫ్లై ఓవర్‌పై చిక్కుకుపోయిన సమయంలో డ్రోన్ లేదా ఇతర దాడులు జరిగే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని యూపీ సీఎం అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని యోగి ఆదిత్యనాథ్ డిమాండ్ చేశారు.
కాగా.. గత వారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనకు వెళ్లారు. ఆయన బఠిండా నుంచి ఫిరోజ్‌పూర్‌కు రోడ్డు మార్గంలో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో ఓ ఫ్లై ఓవర్‌పై మోదీ కాన్వాయ్ దాదాపు 15 నుంచి 20 నమిమిషాల పాటు నిలిచిపోయింది. దీనిపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా స్పందించింది. పంజాబ్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరడంతో.. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇదిలా ఉంటే.. పంజాబ్ ప్రభుత్వం ప్రధాని మోడీ పర్యటనకు అవసరమైన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయలేక ఆయన ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టిందని బీజేపీ మండిపడింది. ప్రధాని మోడీ పర్యటనలో చివరి నిమిషంలో మార్పు వచ్చిందని.. రైతులు రోడ్లమీదకు రావడం ఒక్కసారిగా జరిగిపోయిందని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (UP Election 2022) వేళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మంగళవారం రోజును కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య (Swami Prasad Maurya) తన పదవికి రాజీనామా చేశారు. అలాగే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. స్వామి ప్రసాద్ మౌర్య పార్టీని వీడిన కొద్ది గంటల్లోనే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పారు. అయితే తాజాగా యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లోని మరో మంత్రి కూడా తన పదవికి రాజీనామా చేశారు.
ప్రస్తుతం యూపీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న దారా సింగ్ చౌహాన్ (Dara Singh Chauhan) ఆ పదవికి రాజీనామా చేశారు. ‘నేను అంకితభావంతో పనిచేశాను. అయితే వెనుకబడిన, అణగారిన వర్గాలు, దళితులు, రైతులు, నిరుద్యోగ యువత పట్ల ఈ ప్రభుత్వ అణచివేత వైఖరి.. వెనుకబడిన, దళితుల కోటాను విస్మరించినందుకు బాధతో నేను రాజీనామా చేస్తున్నాను’అని దారా సింగ్ చౌహాన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో యోగి సర్కార్‌కు ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. నిన్న స్వామి ప్రసాద్ మౌర్యను బీజేపీని వీడిన కొద్ది గంటల్లోనే.. ఎమ్మెల్యేల రోషన్‌లాల్ వర్మ, బ్రిజేశ్ ప్రజాపతి, భగవతి ప్రసాద్ సాగర్ కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బిదునా స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న వినయ్ షాక్యా కూడా తాను పార్టీని వీడుతున్నట్టుగా వెల్లడించారు. వీరంతా కూడా సమాజ్ వాదీ పార్టీ చేరనున్నట్టుగా తెలుస్తోంది.