మహా కుంభమేళా 2025 కోసం అలహాబాద్ మ్యూజియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పంత్, నిరాలా, మహాదేవి వర్మ వంటి దిగ్గజ సాహితీవేత్తల రచనలను వారి స్వరంలోనే వినే అవకాశం కల్పిస్తున్నారు.
ప్రయాగరాజ్ : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ కృషి ఫలితంగా ఈసారి మహా కుంభమేళా గతంలో కంటే అత్యంత వైభవంగా జరగనుంది. ఈ క్రమంలో ఎవరూ ఊహించని ఒక కొత్త ఆలోచనను యోగి సర్కార్ అమలు చేస్తోంది. ఇక్కడ అలహాబాద్ మ్యూజియం ప్రయాగరాజ్ తో పాటు భారతదేశంలోని ప్రముఖ హిందీ సాహితీవేత్తల గ్యాలరీని పునరుద్ధరించనుంది. ఇది దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి హిందీ సాహితీవేత్తల గ్యాలరీ. ఇక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులు సుమిత్రానందన్ పంత్, మైథిలిశరణ్ గుప్తా నుండి మహాదేవి వర్మ, రామ్‌ధారి సింగ్ దినకర్, అజ్ఞేయ వంటి గొప్ప రచయితలు, కవులను చూడవచ్చు...వారి అసలు స్వరంలో కవితలు, రచనలు వినవచ్చు. మ్యూజియం దీని కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.
హిందీ దిగ్గజ కవులు, రచయితలతో కూడిన ఈ గ్యాలరీ దేశవిదేశాల నుండి వచ్చే భక్తులకు ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. అలహాబాద్ మ్యూజియం, ప్రయాగరాజ్ కుంభమేళా అధికారులు దీని కోసం ఏర్పాట్లు ప్రారంభించింది.
మ్యూజియం డిప్యూటీ క్యూరేటర్ డాక్టర్ రాజేష్ మిశ్ర మాట్లాడుతూ... ప్రభుత్వ సంకల్పాన్ని అమలు చేయడానికి, ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమాన్ని నవ్యంగా, వైభవంగా, చిరస్మరణీయంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయన్నారు. మహా కుంభమేళా కంటే ముందే దేశంలోని ప్రముఖ సాహితీవేత్తల గ్యాలరీని అలహాబాద్ మ్యూజియం ప్రయాగరాజ్‌లో నిర్మిస్తున్నారు. దీనిలో పంత్, గుప్తా నుండి మహాదేవి, దినకర్, అజ్ఞేయ వంటివారిని ప్రజలు చూడవచ్చు. అంతేకాకుండా వారి స్వరంలో కవితలు కూడా వినవచ్చు. ఇవి ఈ గొప్ప సాహితీవేత్తల అసలు స్వరాలు కావడం విశేషం. వీరు తమ జీవితకాలంలో పాడిన, వినిపించిన వీడియోలను కూడా ప్రజలు చూడవచ్చు.
డాక్టర్ రాజేష్ మిశ్ర చేప్పేదాన్నిబట్టి... ఈ గొప్ప సాహితీవేత్తలందరి కవితా పఠనాలను చూడటం, వినడం ఒక అద్భుతమైన అనుభవం. మ్యూజియంలో దీని కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మహాకుంభ్ సమయంలో కూడా భక్తులు ఈ గొప్ప కవుల రచనలను ఆస్వాదించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం ఫిల్మ్ డివిజన్, దూరదర్శన్, ఆకాశవాణిలతో అలహాబాద్ మ్యూజియం చర్చిస్తోంది. ఈ ప్రముఖ కవుల రచనల జాబితా కూడా అక్కడి నుండి వచ్చింది.