ఆర్టికల్ 370 మళ్లీ తీసుకువస్తే ఏం జరుగుతుందో తెలుసా? : సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Nov 8, 2024, 3:33 PM IST

లక్నోలో జరిగిన ఛత్ పూజ సందర్భంగా సీఎం యోగి, ఆర్టికల్ 370 అంశంపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. దేశాన్ని మళ్ళీ ఉగ్రవాదంలోకి నెట్టాలని చూస్తున్నారని, వాళ్ళ విచ్ఛిన్నవాద ధోరణులను దేశం సహించదని అన్నారు.


లక్నో : ఛత్ పూజ సందర్భంగా లక్నోలోని లక్ష్మణ్ మేళా మైదానంలో జరిగిన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అఖిల భారతీయ భోజ్‌పురి సమాజ్ ఆధ్వర్యంలో ఈ ఛత్ పూజ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం యోగి ప్రసంగిస్తూ ఛత్ పూజ గొప్పతనాన్ని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

ఈ క్రమంలోనే ఆర్టికల్ 370, 35A అంశాలపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలను తీవ్రంగా విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణకు తీర్మానం చేయడంపై స్పందిస్తూ... దేశాన్ని, ముఖ్యంగా కాశ్మీర్ లోయను మళ్ళీ ఉగ్రవాదంలోకి నెట్టాలని ఈ పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి, అక్కడి పిల్లల భవిష్యత్తు వాళ్ళకి పట్టదన్నారు. వాళ్ళ విచ్ఛిన్నవాద ధోరణులను దేశం ఎప్పటికీ సహించదని...దేశ ఐక్యత, సమగ్రతకు 140 కోట్ల మంది భారతీయులు కట్టుబడి ఉన్నారని, వాటితో ఆడుకునే వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించకపోతే ఆర్టికల్ 370, 35A లాగే కాంగ్రెస్ పరిస్థితి కూడా అవుతుందని యోగి హెచ్చరించారు.

Latest Videos

 

కుల, మతాల పేరుతో విడిపోతే ఏం జరుగుతుందంటే...

మనం పండుగలు, వేడుకలతో ప్రజలను ఏకం చేస్తుంటే... కొందరు మాత్రం భారతదేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు యోగి. వారిని ఏ భారతీయుడూ సహించకూడదని సీఎం యోగి సూచించారు. కుల, మతాల పేరుతో విడిపోతే ఇతరులు మనల్ని పాలిస్తారని... 140 కోట్ల మంది ఏకతాటిపైకి వస్తే మన దేశం వైపు ఎవరూ చూడలేరని అన్నారు.

ఆగస్టు 5, 2019న ప్రధాని మోదీ ఆర్టికల్ 370, 35A రద్దు చేసి కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి చరమగీతం పాడారని సీఎం యోగి అన్నారు. పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగం నుంచి ఈ ఆర్టికల్స్ తొలగిపోయాయని... అప్పుడు ప్రపంచం భారతదేశ బలం ఏంటో తెలుసుకుందన్నారు. నయా భారత్ ఎవరికీ హాని చేయదు... కానీ ఎవరైనా రెచ్చగొడితే ఊరుకోదని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని... సమగ్రతకు భంగం కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని యోగి హెచ్చరించారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ అభ్యంతరాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ఆర్టికల్ 370ని కాశ్మీర్‌కు జోడించి దాన్ని ఉగ్రవాద కేంద్రంగా మార్చిందని సీఎం యోగి ఆరోపించారు. కాశ్మీర్‌లో హింస, కాశ్మీరీ పండిట్‌ల హత్యలు జరిగాయని... భారతదేశం పక్షాన మాట్లాడిన వారిని సామూహికంగా హత్య చేశారన్నారు. అది తాత్కాలికమే అని కాంగ్రెస్ చెప్పినా ఎవరూ దాన్ని తొలగించలేకపోయారని... కానీ ప్రధాని మోదీ ఆ పని చేశారని అన్నారు.

నేడు కాశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని, అక్కడ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అనేక విద్యాసంస్థలు, ఆసుపత్రులు, పరిశ్రమలు వెలిశాయన్నారు. లక్షల మంది ప్రజలు వలస వెళ్ళాల్సి వచ్చిన కాశ్మీర్‌లో ప్రధాని మోదీ భద్రత కల్పించి ఆర్టికల్ 370ని రద్దు చేశారని అన్నారు.

కాశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రవాదం ... కాంగ్రెస్, ఎన్సి కోరికిదే 

కాశ్మీర్ అభివృద్ధి చెందుతున్న తరుణంలో అక్కడి కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాలు ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణకు అసెంబ్లీలో తీర్మానం చేశాయని... ఇది వాళ్ళ విచ్ఛిన్నవాద ధోరణికి నిదర్శనమన్నారు యోగి. దేశ ఐక్యతతో ఆడుకుని దేశాన్ని మళ్ళీ ఉగ్రవాదంలోకి నెట్టాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. దేశం మొత్తం కాంగ్రెస్ విచ్ఛిన్నవాద చర్యలను గమనిస్తోందని, దేశ ఐక్యతతో ఆడుకోవడం మానుకోవాలని, దీన్ని మనమందరం ఖండిస్తున్నామని అన్నారు.

ఆర్టికల్ 370 రద్దయిందని, అది మళ్ళీ అమలులోకి రాదన్నారు. ఈ ఆర్టికల్ లోయలో హత్యలకు, ఉగ్రవాదానికి, హింసకు, లక్షలాది మంది అమాయకుల మారణహోమానికి కారణమని... కాశ్మీరీ పండిట్‌ల రక్తంతో తడిసిన ఆర్టికల్ అని అన్నారు. అది కాశ్మీర్ అందాన్ని,భూలోకస్వర్గాన్ని మత ఛాందసత్వంలోకి నెట్టి సామాజిక సామరస్యాన్ని ఛిన్నాభిన్నం చేసిందన్నారు. ఆర్టికల్ 370, 35A కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి కేంద్రంగా మారాయని అన్నారు.

కాంగ్రెస్ పరిస్థితి ఆర్టికల్ 370, 35A లాగే అవుతుంది: సీఎం యోగి

కాశ్మీర్‌లో మీ ప్రభుత్వం చేస్తున్న దుస్సాహసం దేశంలో మళ్ళీ విచ్ఛిన్నవాదానికి దారితీస్తుందని... దీన్ని దేశం దాన్ని సహించదంటూ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌లకు సీఎం యోగి హెచ్చరించారు. 140 కోట్ల మంది భారతీయులు దేశ ఐక్యత, సమగ్రతకు కట్టుబడి ఉన్నారని, వాటితో ఆడుకునే వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వెంటనే కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని వ్యతిరేకించాలని... లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి కూడా ఆర్టికల్ 370, 35A లాగే అవుతుందని హెచ్చరించారు.

భోజ్‌పురిలో ఛత్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం యోగి

భోజ్‌పురిలో మాట్లాడుతూ, సీఎం యోగి అందరికీ ఛత్ పూజ శుభాకాంక్షలు తెలిపారు. కఠినమైన వ్రతాన్ని ఆచరించిన తల్లులు, సోదరీమణులను అభినందించారు. భారతీయ సంస్కృతికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉందని, భోజ్‌పురి సమాజం దానికి మరింత వన్నె తెచ్చిందని అన్నారు. ఛత్ పూజను అఖిల భారతీయ పండుగగా అభివర్ణిస్తూ, అది దేశ, విదేశాల్లో భారతీయ సంస్కృతి వారసత్వాన్ని బలోపేతం చేస్తోందని అన్నారు.

ఛత్ లాంటి పండుగలు మన సంస్కృతిపై గర్వించే అవకాశం కల్పిస్తాయని, సూర్య భగవానుడిని పూజించే ఈ పండుగ ఇది అన్నారు. ఇలీ మన సంస్కృతిలో జీవనానికి ప్రతీక అయిన సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమని... ఈ పండుగ పవిత్రతను దేశభక్తితో ముడిపెట్టాలని సీఎం యోగి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, విధాన పరిషత్ సభ్యుడు గోవింద్ నారాయణ్ శుక్లా, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్, భోజ్‌పురి సమాజ్ జాతీయ అధ్యక్షుడు ప్రభునాథ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.

click me!