ప్రయాగరాజ్ మహా కుంభమేళా ఏర్పాట్లను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...
ప్రయాగరాాజ్ మహా కుంభమేళా : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగరాజ్‌లో 2025 మహా కుంభమేళా ఏర్పాట్లను సమీక్షించారు. చకచకా జరుగుతున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేసారు సీఎం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య... రాష్ట్రంలోని వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనులు జరుగుతున్నాయని... అన్ని సంస్థల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. మహా కుంభమేళా ఓ మహాపర్వమే కాదు ప్రయాగరాజ్ తన ఆతిథ్యం చాటుకునేందుకు ఓ అవకాశం అన్నారు.. దీన్ని సక్సెస్ స్టోరీగా మార్చేందుకు, రాష్ట్ర బ్రాండింగ్ ను మెరుగుపర్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
సనాతన ధర్మంలోకెల్లా అతిపెద్ద వేడుక మహా కుంభమేళా... దీన్ని ఎంతో అద్భుతంగా చేపట్టేందుకు ఏర్పాట్లన్ని జరిగిపోతున్నాయని అన్నారు సీఎం యోగి. ఇప్పటివరకు 20 వేలకు పైగా సన్యాసులు, సంస్థలకు స్థలాలను కేటాయించామని... 13 అఖాడాలు, దండివాడ, ఆచార్య వాడతో పాటు ప్రయాగవాల్ సభ, ఖాక్ చౌక్ లకు స్థలాలు కేటాయించామన్నారు. మిగతా వారికి కూడా కేటాయిస్తున్నామని, కొత్త సంస్థలకు జనవరి 5లోగా స్థలాలు కేటాయిస్తామన్నారు. స్థలాలు, ఇతర సౌకర్యాలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని యోగి తెలిపారు.
undefined
మహాకుంభ్‌లో తొలిసారిగా పాంటూన్ వంతెనల సంఖ్య 22 నుంచి 30కి పెరిగిందని... ఇప్పటికే 20 వంతెనలు సిద్ధమయ్యాయన్నారు. మిగతా వంతెనలు కూడా త్వరలోనే సిద్ధమవుతాయని సీఎం యోగి చెప్పారు. సైనేజ్‌లు ఏర్పాటు చేసే పని కూడా వేగంగా జరుగుతోందని... మేళా ప్రాంతంలో 250, నగరంలో 661 చోట్ల సైనేజ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ జలనిగం కూడా పనులు చేపట్టిందని, గంగానదిలో నీటి ప్రవాహం బాగుండేలా చూస్తున్నామని, గతంతో పోలిస్తే ఈసారి గంగా, యమునా నదుల్లో నీటిమట్టం బాగుందన్నారు. ఈ నీరు శుభ్రంగా ఉందని... మురుగునీరు, పరిశ్రమల వ్యర్థాలు నదుల్లోకి చేరకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బయోరెమిడియేషన్, జియోట్యూబ్ పద్ధతుల ద్వారా నీటిని శుద్ధి చేస్తున్నామని చెప్పారు.
24 గంటలూ విద్యుత్ సరఫరా కోసం 400 కేవీఏ సామర్థ్యం గల 85 సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని... వీటిలో 77 ఇప్పటికే ఏర్పాటయ్యాయని సీఎం తెలిపారు. 250 కేవీఏ సామర్థ్యం గల 14 సబ్‌స్టేషన్లలో 12... 100 కేవీఏ సామర్థ్యం గల 128 సబ్‌స్టేషన్లలో 94 ఏర్పాటయ్యాయని... 1160 కి.మీ.ల ఎల్టీ లైన్, 160 కి.మీ.ల హెచ్టీ లైన్, 48 వేల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశామని సీఎం యోగి చెప్పారు.
ప్రయాగరాజ్‌లో తొలిసారిగా గంగానది రివర్ ఫ్రంట్, పక్కా ఘాట్లు నిర్మిస్తున్నామని, అరైల్‌లో కూడా ఓ ఘాట్ నిర్మిస్తున్నామన్నారు. డిసెంబర్ 30 నాటికి ఇవి పూర్తవుతాయని... శాశ్వత, తాత్కాలిక పనులన్నీ వేగంగా జరుగుతున్నాయన్నారు. జెట్టీ నిర్మాణం కూడా వేగంగా జరుగుతోందన్నారు. ఆరోగ్య శాఖ 100 పడకల తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసిందని, 25 పడకల ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ప్రథమ చికిత్స సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.
మహాకుంభ్‌కు వచ్చే భక్తులకు కారిడార్ల ద్వారా ప్రయాగరాజ్ అందాలను చూపిస్తామని సీఎం యోగి చెప్పారు. అక్షయవట కారిడార్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారని, లేటా హనుమాన్ జీ కారిడార్, సరస్వతీ కూప్ కారిడార్, పాతాళపురి కారిడార్, మహర్షి భరద్వాజ కారిడార్‌లతో పాటు శృంగవేరపురంలో శ్రీరాముడు, నిషాదరాజు కారిడార్‌లు అందుబాటులోకి వచ్చాయని... ద్వాదశ జ్యోతిర్లింగాలు, నాగవాసుకి ఆలయం వంటి క్షేత్రాలను అభివృద్ధి చేశామన్నారు.
నగరపాలక సంస్థ ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలను ఏర్పాటు చేసిందని, మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ ఆలోచనైన త్రివేణీ పుష్పను ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, పరమార్థ ఆశ్రమం కలిసి అభివృద్ధి చేస్తున్నాయన్నారు. టెంట్ సిటీ నిర్మాణం కూడా వేగంగా జరుగుతోందని, 20 వేల మంది భక్తులకు ప్రయాగరాజ్ మేళా ప్రాధికారం టెంట్ సిటీ ఏర్పాటు చేస్తోందన్నారు. ఇతర ప్రముఖుల కోసం 5-6 వేల మంది సామర్థ్యం గల టెంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మేళాలో భద్రతా ఏర్పాట్లు కూడా చేశామని, తొలిసారిగా విపత్తు మిత్రులను నియమిస్తున్నామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు విపత్తు మిత్రులు కూడా భక్తులకు సేవలందిస్తారని సీఎం యోగి తెలిపారు.