
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాదాపు 2 గంటల సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. దాదాపు 40 మంది గాయపడినట్లు సమాచారం.
ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. పరిస్థితి గురించి ఆరా తీసి, బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. ప్రధాని మోదీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
కాగా, తొక్కిసలాట ఘటనపై కుంభమేళా ప్రత్యేక కార్యనిర్వాహక అధికారిణి ఆకాంక్ష రాణా స్పందించారు. కొన్ని బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగి భక్తులు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ప్రయాగరాజ్‌లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
బుధవారం మౌని అమావాస్య. ఈ సందర్భంగా శాహీ స్నానం జరగాల్సి ఉంది. దీనికోసం దాదాపు 10 కోట్ల మంది కుంభమేళాకు చేరుకున్నారు. తీవ్రమైన రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. చాలా మందికి ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. కొందరు స్పృహ కోల్పోయారు. వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. 40కి పైగా అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.
తొక్కిసలాట కారణంగా అన్ని 13 అఖాడాలు శాహీ స్నానాన్ని రద్దు చేశాయి. తదుపరి అమృత స్నానం వసంత పంచమి నాడు జరుగుతుంది. రద్దీని నియంత్రించడానికి అన్ని 30 పాంటూన్ వంతెనలను తెరిచారు. ప్రయాగరాజ్‌లోకి కుంభమేళాకు వెళ్లేవారిని నిలిపివేశారు. రోడ్లపై పోలీసులను మోహరించారు.
కాగా, మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాలో రెండో శాహీ స్నానం నిర్వహిస్తారు. తొక్కిసలాట కారణంగా అది రద్దయింది. ఇక, ఇతర ముఖ్యమైన స్నాన తేదీలు ఫిబ్రవరి 3 (వసంత పంచమి- మూడో శాహీ స్నానం), ఫిబ్రవరి 12 (మాఘీ పూర్ణిమ), ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) మిగిలి ఉన్నాయి.