
Woman beaten up, dragged by moving car in Delhi: దేశంలో మహిళల రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళలపై వరుసగా చోటుచేసుకుంటున్న దాడులు, హింస, అఘాయిత్యాలు దేశంలో మహిళ రక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో నడిరోడ్డుపై ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు దారుణంగా దాడిచేసిన దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు డ్రైవర్లు ఆమెపై దాడి చేయడంతో పాటు కొంత దూరం కారుతో రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. నడిరోడ్డుపై పడేశారు. గాయాలతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభిచారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిర్లక్ష్యంగా చూపిన ముగ్గురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో మహిళను కొట్టినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి హౌజ్ ఖాస్ నుంచి న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలోని సూర్య హోటల్‌కు క్యాబ్‌లో వెళ్లినట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది . ఆమె క్యాబ్ ఓఖ్లా మండి రోడ్డుకు చేరుకోగానే ట్రాఫిక్ కారణంగా క్యాబ్ డ్రైవర్ కారును ఆపాడు. ఈ క్రమంలోనే మరో వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌ను దుర్భాషలాడడం ప్రారంభించాడని ఆమె తెలిపింది. వారి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అయితే, దానిని తాను ఆపడానికి ప్రయత్నించాననీ, ఈ క్రమంలోనే వారు తనను దుర్భాషలాడారని బాధితురాలు పేర్కొంది. ఈ క్రమంలోనే తాను క్యాబ్ నుంచి బయటకు వచ్చానని తెలిపింది.
బాధితురాలిపై దాడి చేయడంతో పాటు కొంత దూరం కారుతో ఈడ్చుకెళ్లారని తెలిపింది. ఆ తర్వాత కారు వేగంగా పోతుండగానే.. తోసేశారనీ, తీవ్రగా గాయపడ్డానని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. శుక్రవారం- శనివారం మధ్య రాత్రి ఈ సంఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష), 509 (ఒక మహిళ అణకువను కించపరిచే పదం, సంజ్ఞ లేదా చర్య), 34 (ఉమ్మడి ఉద్దేశ్యంతో అనేక మంది వ్యక్తులు చేసిన చర్యలు) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన హర్యానాలోని ఫరీదాబాద్ నివాసి ఉదయ్‌వీర్ సింగ్‌ను అదే రోజు అరెస్టు చేసి అతని బాలెనో కారును స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. తదుపరి విచారణ జరుపుతున్నామనీ, బిట్టూ అనే ఇతర నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాను బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు పేర్కొన్న మహిళ, సంఘటన తర్వాత తాను కల్కాజీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు చెప్పారు. అక్కడ ఆమెతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. అమర్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు మరుసటి రోజు తమకు సమాచారం అందిందని, అక్కడ కేసు నమోదు చేస్తామన్నారు. దీంతో కల్కాజీ పోలీస్ స్టేషన్‌లోని ముగ్గురు సిబ్బందిని, ఒక సబ్-ఇన్‌స్పెక్టర్‌తో సహా, ఆలస్యమైన విచారణ నేపథ్యంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.