
ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోనంటూ స్పష్టం చేసిన తరువాత మొదటి సారిగా ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. కాంగ్రెస్ నాయకత్వ మార్పు జరగాలంటూ పీకే సూచించారని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమేనని అన్నారు. ఆయన ప్రెజెంటేషన్ మొత్తం గొప్ప డేటాను అందించిందని తెలిపారు. ఈ మేరకు చిదంబంరం ‘ఎన్ డీటీవీ’కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఆయన చేరిక విషయంలో ఎన్ని ఊహాగానాలు వచ్చినా ప్రశాంత్ కిశోర్ ప్రజెంటేషన్‌లో నాయకత్వం అంశాన్ని చేర్చలేదని చిదంబరం స్పష్టం చేశారు. కానీ అది అద్భుతమైన డేటా విశ్లేషణను కలిగి ఉందని అన్నారు. పీకే ప్రతిపాదనల్లో కొన్నింటిపై పార్టీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. పీకే ప్లాన్‌లో ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా చేయడం లాంటి అంశం ఏమీ లేదని తెలిపారు.
పార్టీలో నాయకత్వ సమస్యను ఆగస్టు నెలాఖరులోగా ఏఐసీసీ అంతర్గత ఎన్నికల ద్వారా పరిష్కరిస్తామని చిదంబరం అన్నారు. ‘‘ ప్రశాంత్ కిశోర్ ఎన్నికలు, ఓటింగ్ సరళి, జనాభా, అభ్యర్థులపై అద్భుతమైన డేటాను అందించారు. పార్టీ వద్ద ఈ రకమైన డేటా ఉందని, ఇలాంటి ప్లాన్ ఉందని నేను అనుకోవడం లేదు. ఆయన విశ్లేషించిన డేటా చాలా బాగుంది. ఈ ప్రతిపాదనల్లో కొన్నింటిని అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. ’’
కాంగ్రెస్ పార్టీకి, ప్రశాంత్ కిశోర్ కు కొన్ని నెలల నుంచి చర్చలు జరుగుతున్నాయి. గత కొంత కాలంగా ఆయన పార్టీలో చేరడం ఇక లాంఛనమే అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ సభ్యునిగా పార్టీలో పని చేయాలన్న ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. కాగా ఈ నిర్ణయంపై ప్రశాంత్ కిశోర్ ను కాంగ్రెస్ ప్రశ్నించలేదని చిదంబరం అన్నారు.
‘‘ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బహుశా సలహాదారుగా తన స్థానాన్ని నిలుపుకోవాలని కోరుకున్నాడు. ఆయన బహుశా టీఆర్‌ఎస్, టీఎంసీ, జగన్‌మోహన్‌రెడ్డికి సలహా ఇస్తున్నారు. ఈ పార్టీల్లో తన సలహాదారు పాత్రను కొనసాగించాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రతిపాదనను అంగీకరించినందుకు అతను IPACతో తన సంబంధాన్నితేల్చుకోవాల్సి వచ్చింది. అయితే IPACతో తెలంగాణ రాష్ట్ర సమితి కుదుర్చుకున్న ఒప్పందం కాంగ్రెస్ కు అడ్డంకి కాదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. చాలా కాలంగా ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు. ఈ విషయంలో సోనియా గాంధీ కుటుంబానికి, పీకే కే పలు దఫాలుగా చర్చలు సాగాయి. అవి విఫలం అయ్యాయి. అయితే ఇటీవల మళ్లీ సోనియా గాంధీ కుటుంబంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి ప్రశాంత్ కిశోర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో 2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ చేపట్టాల్సిన చర్యలు, వ్యూహాలు అన్ని తన ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్రెజెంటేషన్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా సంతృప్తి చెందారు. ఈ విషయాన్ని పలువురు బహిరంగంగా వెళ్లడించారు.
ఈ సమావేశం తరువాత ఇక పీకే కాంగ్రెస్ లో చేరడం ఖాయమే అన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024ని ఏర్పాటు చేశారు. కొన్ని నిర్వచించిన బాధ్యతతో గ్రూప్‌లో భాగంగా పార్టీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. అయితే ఆయన నిరాకరించారు. దీంతో ఇక కాంగ్రెస్ లో ఆయన చేరబోవడం లేదని స్పష్టం అయ్యింది.