Goa News: మనోహర్ పారికర్‌లాగే ప్రమోద్ సావంత్.. ప్రమాణ స్వీకారం ఎక్కడ చేశారో తెలుసా?

Published : Mar 28, 2022, 01:30 PM IST
Goa News: మనోహర్ పారికర్‌లాగే ప్రమోద్ సావంత్.. ప్రమాణ స్వీకారం ఎక్కడ చేశారో తెలుసా?

సారాంశం

గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్నారు. ఈ వేడుకకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారంలో ప్రమోద్ సావంత్.. దివంగత సీఎం మనోహర్ పారికర్‌ను అనుసరించారు.  

పనాజీ: గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. సావంత్ వరుసగా రెండో సారి సీఎం పదవి పగ్గాలు పడుతున్నారు. గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ మరణం తర్వాత ప్రమోద్ సావంత్ ఈ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. గోవా శాసనసభా పక్ష నేతగా ప్రమోద్ సావంత్‌ను ఎన్నుకున్న తర్వాత తాజాగా ఈ రోజు ఆయన గోవా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. గోవా నూతన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సాధారణంగా ముఖ్యమంత్రి రాజ్‌భవన్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ, మనోహర్ పారికర్ ఈ సంప్రదాయానికి చెల్లుచీటి ఇచ్చారు. మనోహర్ పారికర్ రాజ్‌భవన్ ప్రాంగణంలో కాకుండా బయటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమోద్ సావంత్ కూడా ఈ విషయంలో మనోహర్ పారికర్ బాటలోనే నడిచారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో కాకుండా బయటే ప్రమాణం చేశారు.

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, 40 స్థానాలున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్క్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది. 20 సీట్లను బీజేపీ గెలుచుకుంది. కానీ, ఈ పార్టీకి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ మద్దతు ఇచ్చింది. దీంతో మెజార్టీ మార్క్ కంటే కూడా బీజేపీకి ఎక్కువ మద్దతు ఉంది. అయితే, ఆ మద్దతును అసెంబ్లీలో ప్రమోద్ సావంత్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అసెంబ్లీ సెషన్ కోసం గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

సోమవారం నాటి ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ వేడుకకు కనీసం ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి.

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సహా పలువురు హాజరయ్యారు.

ఇటీవల ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ తన పదవికి రాజీనామా చేశారు. చోడంకర్ తన రాజీనామాను ఏఐసీసీకి పంపినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గోవా డెస్క్ ఇన్‌చార్జి దినేష్ గుండూరావు మీడియాకు వెల్ల‌డించారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో చోడంకర్ కాంగ్రెస్‌కు సారథ్యం వహించారు. కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకోగలిగింది. దాని మిత్రపక్షం గోవా ఫార్వర్డ్ పార్టీ ఒక స్థానాన్ని దక్కించుకుంది.  అయితే బీజేపీ 20 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత గురువారం ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, చోడంకర్ తన పార్టీ పేలవమైన ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ వైదొలగాలనే నిర్ణ‌యాన్ని ప్రతిపాదించారు.

చోడంకర్ రాజీనామా ఆమోదం పొందుతుందని, ఆయన స్థానంలో కొత్త వ్యక్తి పార్టీ ప‌గ్గాలు చేప‌డుతార‌ని  కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. "సంకల్ప్ అమోంకర్, అలీక్సో సిక్వేరా మరియు ఎల్విస్ గోమ్స్ వంటి నాయకులు గోవా కాంగ్రెస్ చీఫ్ రేసులో ముందంజలో ఉన్నారు" అని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమోంకర్ మరియు సిక్వేరా గెలుపొందగా, మాజీ బ్యూరోక్రాట్ అయిన గోమ్స్ పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో ఓడిపోయారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?