ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

By Sumanth KanukulaFirst Published Nov 23, 2022, 3:01 PM IST
Highlights

ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విద్యుత్ (సవరణ) బిల్లు 2022కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. 

ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విద్యుత్ (సవరణ) బిల్లు 2022కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలివచ్చిన విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు.

ఇక, విద్యుత్ సవరణ బిల్లు- 2022ను ఈ ఏడాది ఆగస్టు 8న కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.  అదే రోజున పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పరిశీలన కోసం పంపింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పరిశీలనకు, ఆమోదానికి పంపాలని భావిస్తుంది. ఈ బిల్లు  ద్వారా ఒక ప్రాంతంలో బహుళ సర్వీస్ ప్రొవైడర్లను ఎంచుకోవడానికి వినియోగదారులకు ఎంపికలను అందించడం ద్వారా విద్యుత్ పంపిణీ రంగంలో పోటీని సృష్టించడానికి ప్రయత్నం జరుగుతుందని  కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో కూడా విపక్షాలు వ్యతిరేకించాయి. మరోవైపు దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వ విద్యుత్ సంస్థలు నష్టాలపాలవుతాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ దేశవ్యాప్తంగా రాష్ట్ర స్థాయి సమావేశాలను నిర్వహించింది. 
 

click me!