రాజకీయ అస్థిరతకు మరో అంకం.. బిహార్ పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయం ఇదే..!

By Mahesh KFirst Published Aug 10, 2022, 3:30 PM IST
Highlights

నితీష్ కుమార్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో చేతులు కలిపి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన అభిప్రాయాలు పంచుకున్నారు.

న్యూఢిల్లీ: భారత రాజకీయాల పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏ వ్యాఖ్యలు చేసినా అవి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయ పరిణామాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ మార్పులపై ఆయన తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా బయటపెట్టారు. నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీతో కలిసి మళ్లీ మహాఘట్‌బంధన్ 2.0కు తెర లేపారు. ఈ మహాఘట్‌బంధన్ అస్థిరమైనదని అన్నారు. రాజకీయ అస్థిరత్వానికి మరో అధ్యాయమే ఈ మహాఘట్‌బంధన్ 2.0 అని అభిప్రాయపడ్డారు.

బిహార్ రాజకీయ పరిణామాల వెనుక తన ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్పులను ఎలా చూస్తున్నారని అడగ్గా.. ‘బిహార్‌లో గడిచిన 10 ఏళ్లలో ఇది ఆరో ప్రభుత్వం. బిహార్‌లో ఇది మరో అస్థిర రాజకీయ అధ్యాయం. రెండు విషయాలు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి. నితీష్ కుమార్ సీఎంగానే కొనసాగుతున్నారు. రెండోది, రాష్ట్ర పరిస్థితి మాత్రం అద్వాన్నంగానే కొనసాగుతున్నది’ అని వివరించారు.

నితీష్ కుమార్ బీజేపీతో కంఫర్టబుల్‌గా లేడని, అందుకే ఆ ఎన్డీయే కూటమిని వదిలిపెట్టాడని పీకే అభిప్రాయపడ్డారు. ‘ఆర్జేడీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యంపై నిషేధాన్ని విమర్శించింది. మరిప్పుడు ప్రభుత్వంలో భాగమైంది కదా.. వారి వైఖరి ఏమిటో త్వరలోనే తెలియవస్తుంది. అలాగే, తేజస్వీ యాదవ్ పది లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి.. ఆ హామీని ఏం చేస్తారనేది వేచి చూడాల్సిందే’ అని తెలిపారు.

బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. మోడీ 2014లో గెలిచారు కానీ... 2024లో మాత్రం గెలవలేరని జోస్యం చెప్పారు. తాను పూర్తి కాలం పదవిలో వుంటానో లేనో అన్న దానిపై బీజేపీ వాళ్లు ఏమైనా మాట్లాడొచ్చన్నారు. ఆర్జేడీతో మా పొత్తు ఎక్కువ కాలం నిలబడలేదన్న బీజేపీ వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు నితీశ్. 

మరోవైపు .. మహాఘట్‌బంధన్ కూటమి సర్కార్ కొలువు దీరిన సంగతి తెలిసిందే. సీఎంగా నితీశ్ కుమార్ ఎనిమిదో సారి ప్రమాణం స్వీకారం చేశారు. ఏడు పార్టీల కూటమితో నితీశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకాలం ఎన్డీయేతో జతకట్టిన నితీశ్ ఆ బంధానికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

click me!