
న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ(Five States Assembly Elections) ఎన్నికల కోసం ఎన్నికల సంఘం(EC) కసరత్తులు చేస్తున్నది. కానీ, దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) వ్యాపిస్తుండటంతో చాలా మందికి ఈ ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఏర్పడ్డాయి. కానీ, ఎన్నికల సంఘం మాత్రం ఈ ఎన్నికలను వాయిదా వేయాలనే ఆలోచనలో లేనట్టే తెలుస్తున్నది. ప్రస్తుతం దేశంలోని కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్య శాఖ, హోం శాఖ, కొవిడ్ టాస్క్ ఫోర్స్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నది. వీరి నుంచి సలహాలతోపాటు కరోనా కట్టడికి పటిష్ట నిబంధనలనూ, అవలంబించాల్సిన విధానాలపై సూచనలూ కోరింది. తాజాగా, ఎన్నికల సంఘం అధికారులకు దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు, భారత కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ వివరణ ఇచ్చారు.
మన దేశంలో ప్రస్తుతం పెద్ద పెద్ద ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ ఎన్నికల సంఘం అధికారులకు వివరించారు. కాబట్టి, అలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. కాగా, ఎన్నికల సంఘం మాత్రం పెద్ద పెద్ద ర్యాలీలను నివారించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడమో.. నిబంధనలు విధించడమో చేసేలా లేదు. రాజకీయ పార్టీలు తమకు తాముగా పెద్ద ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించకుండా నియంత్రించుకోవాలనే అభిప్రాయం ఎన్నికల సంఘం అధికారుల్లో ఉన్నట్టు తెలిసింది. అంతేకానీ, ప్రత్యేకంగా వాటి కోసం ఎన్నికల సంఘం రంగంలోకి దిగే అవకాశాలు లేవని కొన్ని వర్గాలు వివరించాయి. దాక్టర్ వీకే పాల్ సూచనలతో వర్చువల్ ర్యాలీల నిర్వహణపై పార్టీలు దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Assembly Elections2022: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. యూపీలో ర్యాలీలు రద్దు.. ఎందుకంటే?
త్వరలోనే గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే నెలలో ముగిసే అవకాశం ఉన్నది. కాగా, మిగతా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మార్చిలోనే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. కానీ, ఒమిక్రాన్ ముప్పుతో ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది. ఈ ఐదు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలనే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. టీకా పంపిణీనీ పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించింది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ నేపథ్యంలో ఎన్నికల సంఘం సిబ్బందిని పెంచుకోవాలని యోచిస్తున్నది. అలాగే, వారందరికీ కచ్చితంగా టీకా వేయాలని నిర్ణయించుకుంది. అంతేకాదు, పోలింగ్ కేంద్రాలనూ పెంచాలని భావిస్తున్నది. ఎన్నికల సంఘం ఇటీవలే ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌తో సమావేశం అయింది. దేశంలోని కరోనా పరిస్థితులపై వివరాలు తీసుకోవడానికి భేటీ అయింది. అంతేకాదు, ఈ రోజు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాతోనూ భేటీ అయింది. గత నెల 30న ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ సుశీల్ చంద్ర అన్ని పార్టీల ప్రతినిధులు సకాలంలో ఎన్నికలు నిర్వహించడానికే మొగ్గు చూపినట్టు వెల్లడించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్దేశిత కాలంలో కరోనా నిబంధనలతో ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు తెలిపారు.