
ప్రధాని నరేంద్రమోడీ సభ సందర్భంగా రాజస్థాన్ పోలీసులు చేస్తున్న అతి ప్రభుత్వానికి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ జైపూర్‌లో భారీ బహిరంగసభను తలపెట్టింది. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ప్రతిపక్ష పార్టీలు ఆటంకం కలిగించకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే సభలో కొందరు ఆందోళనకారులు నల్లరంగు జెండాలతో నిరసన తెలిపే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా నలుగు రంగు కనిపిస్తే చాలు కంగారుపడిపోతున్నారు.. నల్లరంగు దుస్తులు వేసుకున్న ఎవరిని సభా ప్రాంగణంలోకి అనుమతించడం లేదు. పోలీసుల ఓవరాక్షన్‌పై ప్రజలు, వివిధ పార్టీల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు..‘ ప్రజలు నిరభ్యంతరంగా నల్లరంగు దుస్తులు ధరించవచ్చని.. కాకపోతే నల్లజెండాలు తీసుకుని వచ్చే వారిని సభా ప్రాంగణంలోకి అనుమతించబోమని.. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.’ కాగా, మోడీ సభ ఏర్పాట్ల కోసం రాజస్థాన్ ప్రభుత్వం రూ.7.23 కోట్లు ఖర్చు చేయడం.. ప్రధానితో ముచ్చటించే మహిళలకు ట్రైనింగ్ ఇచ్చారన్న వార్తలు విమర్శలకు తావిచ్చాయి.