దారుణం : హోటల్‌ బిల్లు విషయంలో గొడవ .. హెడ్ కానిస్టేబుల్‌ను కొట్టి కొట్టి చంపిన కబడ్డీ ఆటగాళ్లు

By Siva Kodati  |  First Published Oct 24, 2023, 6:48 PM IST

పంజాబ్‌లో ఓ కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆటగాళ్లు.. హోటల్ బిల్లు విషయంలో గొడవకు దిగి ఓ కానిస్టేబుల్‌ను కొట్టి చంపారు. వీరిని పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై వారు కాల్పులు జరపగా.. ఎదురు కాల్పుల్లో ఓ ఆటగాడికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. 


పంజాబ్‌లో దారుణం జరిగింది. ఓ కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆటగాళ్లు.. హోటల్ బిల్లు విషయంలో గొడవకు దిగి ఓ కానిస్టేబుల్‌ను కొట్టి చంపారు. వివరాల్లోకి వెళితే.. బర్నాలా పట్టణంలోని రాయ్‌సర్ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు గాను ఇక్కడికి పలు ప్రాంతాల నుంచి ఆటగాళ్లు చేరుకున్నారు. ఓ జట్టుకు చెందిన నలుగురు క్రీడాకారులు బర్నాలాలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేశారు. అయితే బిల్లు విషయంగా ఆటగాళ్లకు, హోటల్ యజమానికి మధ్య వివాదం చెలరేగింది. ఇది చిలికి చిలికి గాలివానగా మారడంతో ఆటగాళ్లు కోపంతో ఊగిపోయారు. దీంతో హోటల్‌లోని ఆహార పదార్ధాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో హోటల్ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కబడ్డీ ఆటగాళ్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులని కూడా చూడకుండా ఓ హెడ్ కానిస్టేబుల్‌పై ఈ నలుగురు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ కిందపడిపోవడంతో ఆయన తల బలంగా నేలకు తగిలి తీవ్రగాయమైంది. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. 

Latest Videos

ఈ విషయం తెలుసుకున్న కబడ్డీ ఆటగాళ్లు పరారయ్యారు. నిందితులను పరంజిత్ సింగ్, జగ్ రాజ్ సింగ్, గుర్మీత్ సింగ్, వజీర్ సింగ్‌గా గుర్తించారు. వీరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు బర్నాలా పోలీస్ యంత్రాంగం తెలిపింది. పరారీలో వున్న నలుగురిని పోలీసులు అతి కష్టం మీద అరెస్ట్ చేశారు. వీరిని పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై వారు కాల్పులు జరపగా.. ఎదురు కాల్పుల్లో ఓ ఆటగాడికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు.. ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన హెడ్ కానిస్టేబుల్ దర్శన్ సింగ్ కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం ప్రకటించారు. అలాగే పోలీస్ శాఖ అందించే బీమా సదుపాయం నుంచి మరో కోటి ఆ కుటుంబానికి అందనుంది. 
 

click me!