ముక్కు కనబడేలా మాస్క్.. కన్నకొడుకు ముందే ఆటోడ్రైవర్‌ను చితకబాదిన పోలీసులు, వైరల్

By Siva KodatiFirst Published Apr 7, 2021, 4:27 PM IST
Highlights

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కరోనా వైరస్ జాగ్రత్తల విషయమై .. ఓ వ్యక్తి పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కరోనా వైరస్ జాగ్రత్తల విషయమై .. ఓ వ్యక్తి పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. ఓ ఆటోడ్రైవర్ ముక్కు భాగాన్ని కవర్ చేసేలా మాస్క్ ధరించనందుకు పోలీసులు అతనిని కుమారుడి ముందే విచక్షణారహితంగా చితకబాదారు.

కృష్ణా కుంజిర్ అనే వ్యక్తి స్థానికంగా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి వద్దకు కుమారుడితో కలిసి ఆటోలో బయల్దేరాడు. ఈ క్రమంలో అతను ధరించిన మాస్క్.. ముక్కు భాగాన్ని కవర్ చేయలేదంటూ పోలీసులు ఆయనను ఆపారు.

కొద్దిసేపు వాగ్వాదం జరిగిన అనంతరం ఆటోడ్రైవర్‌ను స్టేషన్‌కు రావాలని సూచించారు. ఇందుకు డ్రైవర్ నిరాకరించడంతో అతనిని అక్కడే ఇష్టమొచ్చినట్లుగా పోలీసులు చితకబాదారు.

ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణీకులు ఈ తతంగాన్ని ఫోన్‌లో చిత్రీకరిస్తున్నారే తప్ప ఎవ్వరూ పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దాడికి పాల్పడిన పోలీసులను కమల్ ప్రజాపత్, ధర్మేంద్ర జాట్‌లుగా గుర్తించారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో అధికారులు వారిపై చర్యలకు ఉపక్రమించారు. దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేశారు. మాస్క్ సరిగా పెట్టుకోకపోతే పిలిచి మాట్లాడాలి, అవగాహన కల్పించాలి. కానీ నడిరోడ్డుపై చితకబాదడం ఏంటని పలువురు నెటిజన్లు పోలీసులపై మండిపడుతున్నారు. 

click me!